వైజాగ్‌లో భారత్‌- ఆస్ట్రేలియా మ్యాచ్‌.. సర్వం సిద్ధం | Ind vs Aus T20 Series 2023: 1st Match In Vizag All Set To Go For Big Battle | Sakshi
Sakshi News home page

Ind vs Aus: వైజాగ్‌లో భారత్‌- ఆస్ట్రేలియా మ్యాచ్‌.. సర్వం సిద్ధం.. ఏర్పాట్లు పూర్తి

Published Tue, Nov 21 2023 9:18 PM | Last Updated on Wed, Nov 22 2023 8:53 AM

Ind vs Aus T20 Series 2023: 1st Match In Vizag All Set To Go For Big Battle - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత టీమిండియా సొంతగడ్డపై ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధమవుతోంది. ప్రపంచకప్‌ విజేత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ ఆడనుంది. వైజాగ్‌ వేదికగా గురువారం నుంచి ఈ పొట్టి క్రికెట్‌ సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత్- ఆసీస్‌ మ్యాచ్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ మల్లికార్జున, సిటీ పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్, ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. 

అంతర్జాతీయ మ్యాచ్‌ నిర్వహణకు సమయం సమీపించిన తరుణంలో వైజాగ్‌లోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో  మంగళవారం ఆర్గనైజింగ్‌ కమిటీ ఆఖరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగుల సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు. 

ట్రాఫిక్‌ మళ్లింపులు
అదే విధంగా.. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని వాహనాలను దారి మళ్లిస్తామని ఇందుకోసం ప్రత్యేకంగా డీఎస్పీ స్థాయి అధికారులను నియమించామని సీపీ రవిశంకర్‌ పేర్కొన్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పలు జంక్షన్లలో ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారని అన్నారు.  

ఆరు అంబులెన్స్‌లను అందుబాటులో
ఇక మ్యాచ్‌ చూసేందుకు స్టేడియంకు వచ్చే వారిని సకాలంలో స్టేడియంలోకి వెళ్లేలా పోలీసులు సహకరించాలని ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌రెడ్డి సూచించారు. ఫుడ్‌స్టాళ్లలో నిర్దేశించిన ధరలకే విక్రయించే విధంగా ప్రతీస్టాల్‌ వద్ద సిబ్బంది ఉండేలా ఏర్పాటు చేస్తామని జీవీఎంసీ కమిషనర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ తెలిపారు. స్టేడియం వద్ద ఆరు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచడంతో పాటు డాక్టర్ల బృందం, పారా మెడికల్‌ సిబ్బంది అందుబాటులో ఉంటారని డాక్టర్‌ సుధాకర్‌ వెల్లడించారు. 

ఈ సమావేశంలో డీసీపీ శ్రీనివాసరావు, ఏసీఏ జాయింట్‌ సెక్రెటరీ ఎ. రాకేశ్, ట్రెజరర్‌ ఎ.వి.చలం, సీఈవో ఎం.వి.శివారెడ్డి, సీఎఫ్‌వో ఎం.నవీన్‌కుమార్, అపెక్స్‌ కౌన్సిల్‌ మెంబర్లు కె.వి.పురుషోత్తం రావు, ప్రసన్నకుమార్, ఎన్‌.గీత, వీడీసీఏ ప్రెసిడెంట్‌ పి.విష్ణుకుమార్‌ రాజు, వీడీసీఏ జాయింట్‌ సెక్రెటరీలు జె.కె.ఎం.రాజు, ఎ.పి.నాయుడు, సీపీరెడ్డి, ఏసీఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ మీడియా మేనేజర్‌ డి.రాజగోపాల్ ప్రకటన విడుదల చేశారు.

ఓటమితో ముగించి
కాగా వన్డే వరల్‌కప్‌-2023 ఫైనల్లో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే.  అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన తుదిపోరులో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తద్వారా రికార్డు స్థాయిలో ఆరోసారి వన్డే ప్రపంచకప్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో మూడు రోజుల వ్యవధిలోనే ఫైనలిస్టుల మధ్య టీ20 సిరీస్‌ ఆరంభం కావడం విశేషం.

ఈ నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ ఆసీస్‌తో సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. సీనియర్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిలకు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం.. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. మరోవైపు.. ​కంగారూ జట్టు సారథిగా మాథ్యూ వేడ్‌ను ఎంపిక చేసింది ఆసీస్‌ బోర్డు.

ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా:
సూర్యకుమార్‌ యాదవ్‌(కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (వైస్‌ కెప్టెన్ ), ఇషాన్‌ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్‌ వర్మ, రింకూ సింగ్, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్, అక్షర్‌ పటేల్, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ సింగ్, ప్రసిధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్, ముకేశ్‌ కుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement