PC: CApondicherry X
ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక వన్డేలో భారత్- ‘ఎ’ బౌలర్లు ఓ మోస్తరుగా రాణించారు. ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. ఆఖరికి పర్యాటక కంగారు జట్టును 275 పరుగులకు ఆలౌట్ చేశారు.
కాగా రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు ఆసీస్ ‘ఎ’ పురుషుల జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా తొలుత టెస్టు సిరీస్ జరుగగా.. భారత్ ఆసీస్‌పై 1-0తో గెలుపొందింది.
తొలి వన్డేలో ఓటమి
అయితే, వన్డే సిరీస్‌లో మాత్రం ఆరంభంలోనే భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది. తొలి వన్డేలో ఆసీస్ భారత్‌ను ఏకంగా 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పుదుచ్చేరి వేదికగా శుక్రవారం నాటి రెండో వన్డేలో.. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
రాణించిన టాపార్డర్
ఓపెనర్లలో మిచెల్ ఓవెన్ (13 బంతుల్లో 25) వేగంగా ఆడగా.. సామ్ కొన్‌స్టాస్ అర్ధ శతకం (88 బంతుల్లో 67) బాదాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్ కూడా హాఫ్ సెంచరీ (58 బంతుల్లో 58) సాధించాడు.
అయితే, టాపార్డర్ రాణించినప్పటికీ మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ ఆకట్టుకోలేకపోయింది. నాలుగు, ఐదు స్థానాల్లో వచ్చిన కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ (32), లచ్లాన్ షా (25) కాస్త ఫర్వాలేదనిపించగా.. మిగిలిన వారు కనీసం ఇరవై పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయారు. ఫలితంగా 49.5 ఓవర్లలో 275 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది.
అర్షద్ ఖాన్‌కు మూడు వికెట్లు
భారత బౌలర్లలో అర్షద్ ఖాన్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. యశ్ ఠాకూర్ రెండు.. విప్రాజ్ నిగమ్, నిశాంత్ సింధు, సూర్యాంశ్ షెడ్గే, అనుకూల్ రాయ్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
కాగా ఆసీస్‌తో అనధికారిక వన్డే సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్ భారత్- ‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆసీస్‌తో రెండో వన్డే తుదిజట్టులో రుతుతో పాటు సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, కుమార్ కుశాగ్రా, నిశాంత్ సింధు, సూర్యాంశ్ షెడ్గే, విప్రాజ్ నిగమ్, అనుకూల్ రాయ్, అర్షద్ ఖాన్, యశ్ ఠాకూర్ ఉన్నారు.
చదవండి: నన్ను సెలక్ట్ చేయడం ఇష్టం లేకుంటే మానెయ్.. ఉచిత సలహాలు ఇవ్వకు


