PC: Parthiv Patel Instagram/X
క్రికెట్‌ను మతంలా భావించే భారత్‌లో ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు కొదవే లేదు. ఒక్కోసారి పెద్ద ఎత్తున.. నైపుణ్యాలు గల క్రికెటర్లు అందుబాటులో ఉన్న సమయంలో సెలక్టర్లకు జాతీయ జట్టు ఎంపిక తలనొప్పిగా మారుతుంది.
అయితే, జట్టు ప్రయోజనాల దృష్ట్యా అత్యుత్తమ కూర్పు వైపే సెలక్టర్లు మొగ్గుచూపాల్సి ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో సెలక్టర్లు పారదర్శకంగా వ్యవహరించలేకపోతున్నారనే విమర్శలు వస్తాయి.
క్రికెట్‌ను వదిలేసి..
అయితే, గతంలో ఓ సెలక్టర్ తన విషయంలో హద్దులు దాటాడని.. తప్పుడు సలహా ఇచ్చాడని మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ అన్నాడు. క్రికెట్‌ను వదిలేసి.. వ్యాపారం చేసుకోమంటూ ఉచిత సలహా పడేశాడని.. అందుకు తాను కూడా గట్టిగానే బదులిచ్చానని తాజాగా గుర్తు చేసుకున్నాడు.
చిన్న వయసులోనే
కాగా గుజరాత్‌కు చెందిన పార్థివ్ పటేల్ 2002లో.. పదిహేడేళ్ల 152 రోజుల వయసులోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అయితే, మహేంద్ర సింగ్ ధోని రాకతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. తరచూ జట్టులో స్థానం కోల్పోయేవాడు.
ఈ క్రమంలో శ్రీలంకతో 2008 నాటి సిరీస్ సందర్భంగా పునరాగమనం చేసిన పార్థివ్ పటేల్‌కు.. ఆ తర్వాత మళ్లీ నిరాశే ఎదురైంది. అయితే, 2009-10 దేశవాళీ సీజన్‌లో పార్థివ్ మంచి ఫామ్ కనబరిచాడు. ఈ క్రమంలో 2010లో అప్పటి సెలక్టర్‌ను సంప్రదించగా.. అతడి నుంచి ఊహించని సమాధానం వచ్చిందట.
అందరి కంటే గొప్పగా నా రికార్డు
భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్థివ్ పటేల్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘నా ప్రదర్శన బాగా లేనప్పుడు జట్టు నుంచి తప్పిస్తారని తెలుసు. అయితే, 2009-10 సమయంలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో నేను ఐదు వరుస ఇన్నింగ్స్‌లో కలిపి 500కు పైగా పరుగులు చేశాను.
అప్పట్లో అదే రికార్డు. నిజానికి సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, సునిల్ గావస్కర్ కూడా ఇలా ఐదు వరుస ఇన్నింగ్స్‌లో ఐదు వందల పరుగులు చేయలేదు. అప్పుడే టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. దీంతో నేను అప్పటి చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్‌కు ఫోన్ చేసి నా అవకాశాల గురించి అడిగాను.
నువ్వైతే శ్రమిస్తూనే ఉండు
అందుకు ఆయన.. ‘దురదృష్టవశాత్తూ.. నీకు ఈసారి కూడా అవకాశం లేదు. నువ్వైతే శ్రమిస్తూనే ఉండు. ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది’ అని బదులిచ్చాడు. ఆ తర్వాత 2011 నుంచి నేను ప్రతీ సీజన్‌లోనూ నిలకడగా 700-800 పరుగులు చేశాను.
బిజినెస్ చేసుకో
అప్పటికి సెలక్షన్ కమిటీ మారింది. అప్పుడు నేను కొత్తగా వెస్ట్ జోన్ నుంచి సెలక్టర్‌గా వచ్చిన వ్యక్తికి ఫోన్ చేశాను. అప్పుడు అతడు.. ‘నీకు 27-28 ఏళ్లు ఉంటాయి కదా!.. నువ్వు గుజరాతీవి. ఏదైనా వ్యాపారం గురించి ఆలోచించు. బిజినెస్ చేసుకో’ అని సలహా పారేశాడు.
సెలక్ట్ చేయడం ఇష్టం లేకపోతే మానెయ్..
నేను వెంటనే.. ‘నీకు నన్ను సెలక్ట్ చేయడం ఇష్టం లేకపోతే మానెయ్.. అంతేగానీ ఇలా నిరాశపరచడం తగదు. నీ ఆలోచన నీది. పర్లేదు. రెండేళ్లు పదవిలో ఉంటావు కదా!.. నీ హయాంలోనే నేను రీఎంట్రీ ఇస్తా చూడు’ అని సవాలు విసిరాను. అన్నట్లుగానే పునరాగమనం చేశాను’’ అని పార్థివ్ పటేల్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. కాగా 2018లో పార్థివ్ టీమిండియా తరఫున చివరి మ్యాచ్ ఆడేశాడు.
చదవండి: సెలక్టర్లతో మాట్లాడాను.. టీమిండియాలో అతడి రీఎంట్రీ కష్టమే


