ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. తుది జట్టులో రుతురాజ్‌..?

IND VS AUS 1st ODI: Team India Prediction, Ruturaj May Be Included In Final XI - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కోసం రెండు వేర్వేరు జట్లను భారత సెలెక్టర్లు నిన్న (సెప్టెంబర్‌ 18) ప్రకటించిన విషయం తెలిసిందే. సిరీస్‌లోని తొలి రెండు వన్డేలకు ఓ జట్టును, చివరి మ్యాచ్‌ కోసం మరో జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. తొలి రెండు మ్యాచ్‌లకు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు రెస్ట్‌ ఇవ్వడంతో ఈ మ్యాచ్‌లకు కేఎల్‌ రాహుల్‌ టీమిండియా సారధిగా వ్యవహరిస్తాడు. ఈ మ్యాచ్‌లకు రోహిత్‌తో పాటు విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌లకు సెలెక్టర్లు రెస్ట్‌ ఇచ్చారు. 

రోహిత్‌, కోహ్లి, హార్దిక్‌, కుల్దీప్‌ యాదవ్‌లు తిరిగి మూడో వన్డేకు జట్టులో చేరతారు. అందరూ ఊహించిన విధంగానే సెలెక్టర్లు వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు పిలుపునిచ్చారు. ఊహించని విధంగా తొలి రెండు వన్డేలకు రుతురాజ్‌ గైక్వాడ్‌ ఎంపికయ్యాడు. గైక్వాడ్‌ ఆసియా క్రీడల్లో టీమిండియాకు నాయకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఆసీస్‌తో సిరీస్‌కు జట్టు ప్రకటన నేపథ్యంలో సెప్టెంబర్‌ 22న మొహాలీ వేదికగా జరిగే తొలి వన్డేలో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందోనన్న అంచనాలు ఇప్పటినుంచే మొదలయ్యాయి. 

తొలి వన్డేలో రుతురాజ్‌ తుది జట్టులో ఉంటాడని ఫ్యాన్స్‌ అంచనా వేస్తున్నారు. వరల్డ్‌కప్‌కు స్టాండ్‌బైగా ఎంపిక చేసే ఉద్దేశంతోనే రుతురాజ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే ఆసీస్‌తో తొలి వన్డేలో గిల్‌తో పాటు రుతురాజ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. వన్‌డౌన్‌లో ఇషాన్‌ కిషన్‌, నాలుగో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌, ఐదో ప్లేస్‌లో కేఎల్‌ రాహుల్‌, ఆరో స్థానంలో తిలక్‌ వర్మ, ఏడో స్థానంలో రవీంద్ర జడేజా, ఎనిమిదిలో అశ్విన్‌, స్పెషలిస్ట్‌ పేసర్లుగా షమీ, బుమ్రా, సిరాజ్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. 

ఆసీస్‌తో తొలి వన్డేకు భారత తుది జట్టు (అంచనా): గిల్‌, రుతురాజ్‌, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, తిలక్‌ వర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్‌, షమీ, బుమ్రా, సిరాజ్‌  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top