
PC: ICC
త్వరలోనే వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు
లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్ (LA28 Olympics)లో క్రికెట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, నిబంధనలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఉన్నతస్థాయి సమావేశం శుక్రవారం సింగపూర్‌లో జరిగింది. విశ్వక్రీడల్లో క్రికెట్ కోసం ఐసీసీ వర్కింగ్ గ్రూప్ (ICC Working Group)ను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించింది. ఈ గ్రూప్ సిఫార్సులతోనే ఒలింపిక్స్‌లో క్రికెట్ క్రీడ నియమావళిని ఖరారు చేయాలని ఐసీసీ భావిస్తోంది.
శుక్రవారం జరిగిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల కమిటీ (సీఈసీ) సమావేశంలో ప్రధానంగా వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుపైనే చర్చ జరిగింది. ఒలింపిక్స్ కోసం ఈ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నప్పటికీ చాన్నాళ్లుగా ఇది పెండింగ్‌లో పడింది.
ఇక ఇప్పుడు వేగవంతం చేయాల్సిన అవసరం వచ్చిందని పలువురు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఈసీ, క్రికెట్ బోర్డులు... ఈ రెండింటి నుంచి సభ్యులతో కూడిన వర్కింగ్ గ్రూప్ బృందానికి పలు బాధ్యతలు అప్పగిస్తారు.
లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు అర్హత పద్ధతిని ఖరారు చేయడం, ఐసీసీ వర్గాలు, సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వర్కింగ్ గ్రూప్ పని చేయడంపై ఈ సమావేశంలో చర్చించారు.
విశ్వక్రీడల కోసం ర్యాంకింగ్‌తో జట్లను ఖరారు చేయాలా లేదంటే క్వాలిఫయింగ్ టోర్నీని నిర్వహించడం ద్వారా జట్లను ఒలింపిక్స్‌కు పంపించాలా అన్న అంశాన్ని వర్కింగ్ గ్రూప్‌కే వదిలేయాలని ఐసీసీ చైర్మన్ జై షా సూచించారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే ఆటగాళ్ల కనీస వయస్సును 15 ఏళ్లుగా ఉంటేనే మంచిదని ఐసీసీ కమిటీ ఇదివరకే సిఫార్సు చేసింది. ఐసీసీ నూతన సీఈఓ సంజోగ్ గుప్తాకూడా 15 ఏళ్ల వయసు ప్రామాణికమేనని బలపరిచారు. ఐసీసీ ఉన్నతస్థాయి సమావేశంలో జై షా, సంజోగ్ సహా పలువురు ఐసీసీ బోర్డు కమిటీల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.