మహిళలూ మురిపించారు  | ICC Womens World Cup 2025: India wins over Pakistan by 88 Runs | Sakshi
Sakshi News home page

ICC Womens World Cup 2025: మహిళలూ మురిపించారు 

Oct 5 2025 11:04 PM | Updated on Oct 6 2025 12:53 AM

ICC Womens World Cup 2025: India wins over Pakistan by 88 Runs

రాణించిన హర్లీన్‌ డియోల్‌ 

బంతితో మెరిసిన క్రాంతి, దీప్తి

ఈ నెల 9న దక్షిణాఫ్రికాతో భారత్‌ తదుపరి పోరు

పాక్‌ టాస్‌ నెగ్గిన తీరు... బౌలింగ్‌ జోరు... భారత శిబిరాన్ని కాస్త కలవరపెట్టింది. కానీ చివరకు నిర్ణీత ఓవర్ల తర్వాత భారత స్కోరు హర్మన్‌ప్రీత్‌ బృందం ఆందోళనను దూరం చేసింది. లక్ష్యఛేదనకు దిగిన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను టీమిండియా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆరంభంలోనే చిక్కుల్లో పడేసింది. బౌలర్లు ఏమాత్రం పట్టుసడలించకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూనే మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించారు. పాకిస్తాన్‌పై తమ అజేయ రికార్డును పొడిగించారు.  

కొలంబో: సొంతగడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన భారత మహిళల జట్టు ఇప్పుడు శ్రీలంకలో పాకిస్తాన్‌ పనిపట్టింది. బ్యాటింగ్‌ వైఫల్యంతో తడబడిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం బౌలింగ్‌ బలగంతో పాక్‌ను చిత్తు చేసింది. 88 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు పాకిస్తాన్‌ను ఓడించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌ కూడా పురుషుల ఈవెంట్‌లాగే ఏకపక్షంగా ముగిసింది. 

మొత్తమ్మీద వరుసగా నాలుగు ఆదివారాలు పాక్‌ జట్లకు, వారి అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిరీ్ణత 50 ఓవర్లలో 247 పరుగుల వద్ద ఆలౌటైంది. హర్లీన్‌ డియోల్‌ (65 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా, రిచా ఘోష్‌ (20 బంతుల్లో 35 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడింది. ప్రత్యర్థి బౌలర్లలో డయానా బేగ్‌ 4, సాదియా, ఫాతిమా చెరో 2 వికెట్లు తీశారు. 

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పాకిస్తాన్‌ 43 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. సిద్రా అమిన్‌ (106 బంతుల్లో 81; 9 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత జట్టు నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈనెల 9న విశాఖపట్నంలో జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్‌ ఆడుతుంది. నేడు ఇండోర్‌లో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో దక్షిణాఫ్రికా తలపడుతుంది. 

మెరుగ్గానే మొదలైనా... 
ప్రతీక (37 బంతుల్లో 31; 5 ఫోర్లు), స్మృతి మంధాన (23; 4 ఫోర్లు) ఓపెనింగ్‌ వికెట్‌కు 48 పరుగులతో మంచి ఆరంభమే ఇచ్చారు. కానీ 19 పరుగుల వ్యవధిలో ఇద్దరు ని్రష్కమించారు. తర్వాత హర్లీన్,  కెప్టెన్‌ హర్మన్‌ జట్టు స్కోరును వంద పరుగులు దాటించారు. కాసేపటికే కెపె్టన్‌ వికెట్‌ను పారేసుకుంది. జెమీమా (37 బంతుల్లో 32; 5 ఫోర్లు), హర్లీన్‌ కొద్దిసేపు ఇన్నింగ్స్‌ను నడిపించారు. కానీ జట్టు స్కోరు 151 వద్ద హర్లీన్, 159 వద్ద జెమీమా అవుట్‌కావడంతో భారత్‌ ఇబ్బందిపడింది. స్నేహ్‌ రాణా (20; 2 ఫోర్లు), ఆఖర్లో రిచా మెరుపులతో చివరకు గట్టిస్కోరే ప్రత్యర్థి ముందుంచింది. 

సిద్రా ఒంటరి పోరాటం 
లక్ష్యం ఏమంత కష్టమైంది కాకపోయినా... పాక్‌ మాత్రం ఆరంభం నుంచే కష్టాల్లో కూరుకు పోయింది. తర్వాత ఏటికి ఎదురీదలేక, పూర్తి కోటా ఓవర్లనైనా ఆడలేక ఆలౌటైంది. భారత బౌలింగ్‌ దెబ్బకు ఓపెనర్లు మునీబా (2), సదాప్‌ షమా (6) సహా, మిడిలార్డర్‌లో అలియా (2), కెప్టెన్‌ ఫాతిమా సనా (2) సింగిల్‌ డిజిట్‌లకే వెనుదిరిగారు. సిద్రా అమిన్, నటాలియా (33; 4 ఫోర్లు)తో కలిసి  ఒంటరి పోరాటం చేసింది. ఇద్దరు నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరు 
అవుటయ్యాక ఇన్నింగ్స్‌ కూలేందుకు ఎంతోసేపు పట్టలేదు. స్నేహ్‌ రాణాకు 2 వికెట్లు దక్కాయి.

మ్యాచ్‌ రిఫరీ చేసిన పొరపాటుతో... 
దక్షిణాఫ్రికాకు చెందిన రిఫరీ శాండ్రె ఫ్రిజ్‌ గందరగోళంతో ‘టాస్‌’ నిర్ణయమే బోల్తా పడింది. పాక్‌ సారథి ఫాతిమా ‘బొరుసు’ చెప్పగా... హర్మన్‌ ఎగరేసిన నాణెం ‘బొమ్మ’గా తేలింది. మ్యాచ్‌ రిఫరీ మాత్రం పాక్‌ కెపె్టన్‌ టాస్‌ గెలిచినట్లు ప్రకటించింది. అంతా తెలిసినా హర్మన్‌ కూడా అభ్యంతరం చెప్పక పోవడమే ఇక్కడ కొసమెరుపు! ఇక మహిళా సారథులు సైతం కరచాలనం చేసుకోకుండానే సమరానికి సై అన్నారు.

స్కోరు వివరాలు 
భారత మహిళల ఇన్నింగ్స్‌: ప్రతీక (బి) సాదియా 31; స్మృతి (ఎల్బీడబ్ల్యూ) (బి) ఫాతిమా 23; హర్లీన్‌ (సి) నష్రా (బి) రమీన్‌ 46; హర్మన్‌ప్రీత్‌ (సి) సిద్రా నవాజ్‌  (బి) డయానా 19; జెమీమా (ఎల్బీడబ్ల్యూ) (బి) నష్రా 32; దీప్తి శర్మ (సి) సిద్రా నవాజ్‌ (బి) డయానా 25; స్నేహ్‌ రాణా (సి) ఆలియా (బి) ఫాతిమా 20; రిచా ఘోష్‌ (నాటౌట్‌) 35; శ్రీచరణి (సి) నటాలియా (బి) సాదియా 1; క్రాంతి (సి) ఆలియా (బి) డయానా 8; రేణుక (సి) సిద్రా నవాజ్‌ (బి) డయానా 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్‌) 247. 

వికెట్ల పతనం: 1–48, 2–67, 3–106, 4–151, 5–159, 6–201, 7–203, 8–226, 9–247, 10–247. 

బౌలింగ్‌: సాదియా 10–0–47–2, డయానా బేగ్‌ 10–1–69–4, ఫాతిమా 10–2–38–2, రమీన్‌ 10–0–39–1, నష్రా 10–0–52–1. 

పాకిస్తాన్‌ మహిళల ఇన్నింగ్స్‌: మునీబా అలీ (రనౌట్‌) 2; షమా (సి అండ్‌ బి) క్రాంతి 6; సిద్రా అమిన్‌ (సి) హర్మన్‌ (బి) స్నేహ్‌ రాణా 81; ఆలియా (సి) దీప్తి (బి) క్రాంతి 2; నటాలియా (సి) సబ్‌–రాధ (బి) క్రాంతి 33; ఫాతిమా (సి) స్మృతి (బి) దీప్తి 2; సిద్రా నవాజ్‌ (సి అండ్‌ బి) స్నేహ్‌ 14; రమీన్‌ (బి) దీప్తి 0; డయానా బేగ్‌ (రనౌట్‌) 9; నష్రా (నాటౌట్‌) 2; సాదియా (సి) స్మృతి (బి) దీప్తి 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (43 ఓవర్లలో ఆలౌట్‌) 159. 

వికెట్ల పతనం: 1–6, 2–20, 3–26, 4–95, 5–102, 6–143, 7–146, 8–150, 9–158, 10–159. 

బౌలింగ్‌: రేణుక 10–1–29–0, క్రాంతి 10–3–20–3, స్నేహ్‌ రాణా 8–0–38–2, శ్రీచరణి 6–1–26–0, దీప్తి శర్మ 9–0–45–3.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement