టెస్టుల్లో 'స్టాప్‌ క్లాక్‌' | ICC steps to control slow overrate | Sakshi
Sakshi News home page

టెస్టుల్లో 'స్టాప్‌ క్లాక్‌'

Jun 27 2025 4:02 AM | Updated on Jun 27 2025 4:02 AM

ICC steps to control slow overrate

‘స్లో ఓవర్‌రేట్‌’ నియంత్రణకు ఐసీసీ చర్యలు

‘షార్ట్‌ రన్‌’కు పాల్పడితే ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు  

దుబాయ్‌: టెస్టు క్రికెట్‌లో జాప్యాన్ని తగ్గించి మరింత రసవత్తరంగా మార్చే దిశగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రయత్నాలు ప్రారంభించింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో ‘స్లో ఓవర్‌రేట్‌’ను నియంత్రించేందుకు ఐసీసీ ‘స్టాప్‌ క్లాక్‌’ పద్ధతిని ప్రవేశ పెట్టింది. 2025–27 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) సైకిల్‌లో ఈ కొత్త నిబంధనలు అమలవుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్‌ మధ్య ఒక టెస్టు మ్యాచ్‌ పూర్తికాగా... ప్రస్తుతం రెండో టెస్టు జరుగుతోంది. 

మరోవైపు ఆ్రస్టేలియా, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో సైతం ఈ కొత్త నిబంధనలు అమలవుతున్నాయి. దీంతో పాటు బ్యాటర్లు వికెట్ల మధ్య పరుగు తీసే సమయంలో ఉద్దేశపూర్వకంగా ‘షార్ట్‌ రన్‌’కు పాల్పడితే... స్ట్రయిక్‌లో ఎవరు ఉండాలనే నిర్ణయం ఫీల్డింగ్‌ జట్టు సారథి తీసుకునే అవకాశం కల్పించింది. ఆటను మరింత జనరంజకంగా మార్చే ప్రక్రియలో భాగంగా ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. 

» ‘స్లో ఓవర్‌రేట్‌’ను అరికట్టేందుకు బోర్డు నడుం బిగించింది. ఓవర్‌కు ఓవర్‌కు మధ్య వ్యవధిని 60 సెకన్లకు పరిమితం చేసింది.   
» టెస్టు మ్యాచ్‌లో ఒక ఓవర్‌ ముగిసిన అనంతరం మైదానంలోని ‘స్టాప్‌ క్లాక్‌’లో కౌంట్‌డౌన్‌ ప్రారంభమవుతుంది. 60 సెకన్లలో తదుపరి ఓవర్‌ తొలి బంతి పడాల్సి ఉంటుంది.  
» నిర్ణీత సమయంలో ఓవర్‌ ప్రారంభం కాకపోతే... అంపైర్లు హెచ్చరిస్తారు.  
» బౌలింగ్‌ చేస్తున్న జట్టు రెండు సార్లకు మించి అంప్లైర్ల హెచ్చరికలు పొందితే... బ్యాటింగ్‌ జట్టుకు అదనంగా 5 పరుగులు కేటాయిస్తారు.  
» ఒక ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లు ముగిస్తే హెచ్చరికలను తిరిగి ఒకటి నుంచి లెక్కిస్తారు. 
» బంతి ఆకారం మారిందని అంపైర్లు గుర్తిస్తే ఏ సమయంలోనైనా బాల్‌ను మార్చవచ్చు.  
»  ఫీల్డ్‌ అంపైర్‌ ‘అవుట్‌’ అని ఇచ్చిన నిర్ణయంపై రెండో సమీక్ష జరిగితే... ఆ నిర్ణయంలో స్పష్టత రాకుంటే దాన్ని అవుట్‌గానే పరిగణించనున్నారు. ఉదాహరణకు... ఒక బ్యాటర్‌ క్యాచ్‌ అవుటైన సందర్భంలో ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ ఇచ్చిన నిర్ణయాన్ని బ్యాటర్‌ సవాలు చేసి బంతి ప్యాడ్‌లను తాకినట్లు రీప్లేల్లో చూపించి నాటౌట్‌గా నిర్ణయిస్తే... టీవీ అంపైర్‌ ఎల్బీని పరిశీలిస్తాడు. ఈ సందర్భంలో డిఫాల్ట్‌ నిర్ణయం ‘అవుట్‌’గానే ఉంటుంది. బాల్‌ ట్రాకింగ్‌ విధానంలో పరిశీలించిన అనంతరం ‘అంపైర్‌ కాల్‌’ చూపిస్తే బ్యాటర్‌ క్రీజు వదిలి వెళ్లాల్సి ఉంటుంది.  
»   ఉద్దేశపూర్వకంగా షార్ట్‌ రన్‌కు పాల్పడితే... అదనపు ప్రయోజనం పొందాలనే లక్ష్యంతోనే ఇలా చేసినట్లు అంపైర్లు భావిస్తే... ఫీల్డింగ్‌ జట్టుకు 5 పరుగులు అదనంగా అందివ్వనున్నారు. దీంతో పాటు తదుపరి బంతికి ఎవరు స్ట్రయిక్‌ తీసుకోవాలనే అంశం కూడా నిర్ణయించే అధికారం ఫీల్డింగ్‌ జట్టు కెపె్టన్‌కు కల్పిస్తారు.  

Advertisement
 
Advertisement
Advertisement