ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ పేర్ల ప్రకటన | ICC Reveals Player Of The Month Nominees For May | Sakshi
Sakshi News home page

ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ పేర్ల ప్రకటన

Jun 11 2026 4:07 PM | Updated on Jun 11 2026 4:17 PM

ICC Reveals Player Of The Month Nominees For May

2026 మే నెలకు సంబంధించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ నామినీస్‌ పేర్లను ఐసీసీ ఇవాళ (జూన్‌ 11) ప్రకటించింది. ఈ జాబితాలో బంగ్లాదేశ్‌ ఆటగాళ్ల హవా కనిపించింది. గత నెలలో ఆ జట్టు పాకిస్తాన్‌పై టెస్ట్‌ సిరీస్‌ విజయం (2-0తో క్లీన్‌ స్వీప్‌) సాధించిన విషయం తెలిసిందే.

ఈ సిరీస్‌లో విశేషంగా రాణించిన వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీం, స్పిన్‌ బౌలర్‌ తైజుల్‌ ఇస్లాం ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌గా ఎంపికయ్యారు. మరో నామినీగా నేపాల్‌ ఆల్‌రౌండర్‌ దీపేంద్ర సింగ్‌ ఎయిరీ ఎంపికయ్యాడు. దీపేంద్ర గత నెలలో ఆడిన వన్డేల్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో చెలరేగాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు.

ముష్ఫికర్‌ రహీం
ఈ వెటరన్ బ్యాటర్ మే నెలలో అసాధారణంగా రాణించాడు. పాక్‌పై రెండు టెస్టుల్లో 253 పరుగులు చేశాడు. రెండో టెస్టులో 137 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను పూర్తిగా బంగ్లాదేశ్ వైపు తిప్పేశాడు.

తైజుల్‌ ఇస్లాం
బంగ్లాదేశ్ ప్రధాన స్పిన్నర్ అయిన తైజుల్‌ పాక్‌తో జరిగిన సిరీస్‌లో 13 వికెట్లతో సిరీస్‌ టాప్‌ వికెట్ టేకర్‌గా నిలిచాడు. రెండో టెస్టులో మ్యాచ్ విన్నింగ్ స్పెల్ (6/120) ఇందులో హైలైట్‌గా నిలిచింది.

దీపేంద్ర సింగ్‌ ఎయిరీ
ఎయిరీ గత నెలలో జరిగిన వన్డేల్లో ఓ సెంచరీ (యూఏఈపై), రెండు హాఫ్‌ సెంచరీలు (యూఎస్‌ఏపై) సహా 8 వికెట్లు తీశాడు. అతడి ఆల్‌రౌండ్ ప్రదర్శనల వల్ల నేపాల్ కీలక విజయాలు సాధించింది.

మహిళల విషయానికొస్తే.. ఇంగ్లండ్‌ బౌలర్‌ లారెన్‌ బెల్‌, పాకిస్తాన్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ గుల్‌ ఫెరోజా, న్యూజిలాండ్‌ బ్యాటర్‌ మ్యాడీ గ్రీన్‌ మే నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement