భారత్‌తో నెలకొన్న రాజకీయ ఉద్రికత్తల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ 2026లో తాము ఆడాల్సిన గ్రూప్ మ్యాచ్‌ల వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ విషయంలో పునఃపరిశీలనలు ఉండవని తేల్చి చెప్పింది.
ఇవాళ (జనవరి 21) జరిగిన అత్యవసర బోర్డు సమావేశంలో ఓటింగ్ ద్వారా ఈమేరకు నిర్ణయించింది. మొత్తం 16 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా.. కేవలం ఇద్దరు మాత్రమే బంగ్లాదేశ్ అభ్యర్థనకు మద్దతు ఇచ్చారు. మిగతా సభ్యులు వ్యతిరేకించారు.
భరోసా ఇచ్చినా..!
భద్రతను సాకుగా చూపుతూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరిస్తున్న బంగ్లాదేశ్ జట్టుకు ఐసీసీ పూర్తి భరోసా ఇచ్చింది. అయినా ఆ దేశ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ చేస్తుంది. తాజాగా జరిగిన సమావేశంలో స్వతంత్ర సంస్థలు చేసిన భద్రతా అంచనాలు, వేదికల వారీగా రూపొందించిన భద్రతా ప్రణాళికలు, ఆతిథ్య దేశం ఇచ్చిన హామీలన్నిటినీ ఐసీసీ క్షుణ్ణంగా పరిశీలించి, బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది.
ముస్తాఫిజుర్ ఉదంతంతో సంబంధమే లేదు
భారత్‌లో ఆడకుండా ఉండటానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చూపుతున్న సాకులకు, ముస్తాఫిజుర్ రహ్మాన్ ఉదంతంతో సంబంధమే లేదని ఐసీసీ పేర్కొంది. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడాన్ని భద్రతా సమస్యతో అనుసంధానం చేయడం సరి కాదని హితవు పలికింది.
స్కాట్లాండ్‌కు అవకాశం
ఒకవేళ బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రాకపోతే, వారి స్థానాన్ని స్కాట్లాండ్ భర్తీ చేస్తుంది. ప్రస్తుతం స్కాట్లాండ్ టీ20 ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉంది. ప్రపంచకప్‌కు అర్హత సాధించని జట్లలో అత్యధిక ర్యాంక్ కలిగిన జట్టుగా స్కాట్లాండ్ ప్రపంచకప్‌కు ఎంపికవుతుంది.
మరో 24 గంటల డెడ్‌లైన్
ఇది జరగకుండా ఉండాలంటే బంగ్లాదేశ్ మరో 24 గంటల్లో ఏ విషయం తేల్చాలని ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈలోపు కూడా బంగ్లాదేశ్ ఏ విషయం తేల్చకపోతే డీఫాల్ట్‌గా స్కాట్లాండ్ ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది.
షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్.. వెస్టిండీస్, ఇంగ్లండ్, నేపాల్, ఇటలీ జట్లతో కలిసి గ్రూప్-సిలో ఉంది. బంగ్లాదేశ్ తొలి మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలో ఆడి, చివరి గ్రూప్ మ్యాచ్‌ను ముంబైలో ఆడేలా షెడ్యూల్ ఉంది.


