
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2 2023-27లో భాగంగా నిన్న (మే 17) కెనడాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో యూఎస్‌ఏ ప్రాతినిథ్యం వహిస్తున్న భారత క్రికెటర్లు స్మిట్ పటేల్, మిలింద్ కుమార్ సెంచరీలతో చెలరేగిపోయారు. ఫ్లోరిడా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా.. ఓపెనర్ స్మిట్ పటేల్ (137 బంతుల్లో 152 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు), ఐదో నంబర్ ఆటగాడు మిలింగ్ కుమార్ (67 బంతుల్లో 115 నాటౌట్; 12 ఫోర్లు, 5 సిక్సర్లు అజేయ సెంచరీలతో శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 361 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కెనడా.. సంజయ్ కృష్ణమూర్తి (3.2-0-10-3), కెంజిగే (10-0-41-2), మిలింద్ కుమార్ (9-0-40-2), హర్మీత్ సింగ్ (10-1-38-2), జస్దీప్ సింగ్ (7-0-35-1) సత్తా చాటడంతో 46.2 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా యూఎస్‌ఏ 169 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో మిలింద్, స్మిట్ పటేల్ రికార్డు సెంచరీలతో కదంతొక్కడంతో యూఎస్‌ఏ వన్డేల్లో తమ అత్యధిక స్కోర్‌ను (361) నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో 60 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన మిలింద్.. వన్డేల్లో యూఎస్‌ఏ తరఫున వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలో మిలింద్ టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో రెండో వేగవంతమైన సెంచరీ చేసిన ఇండియన్ బార్న్ బ్యాటర్‌గా సెహ్వాగ్ సరసన నిలిచాడు. సెహ్వాగ్ 2009లో న్యూజిలాండ్‌పై 60 బంతుల్లో సెంచరీ చేశాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ బార్న్ ప్లేయర్ రికార్డు విరాట్ కోహ్లి (52 బంతులు) పేరిట ఉంది.
ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 44 బంతులు తీసుకున్న మిలింద్.. ఆతర్వాత హాఫ్ సెంచరీని కేవలం 16 బంతుల్లో పూర్తి చేశాడు. ఈ క్రమంలో మిలింద్ ఓ ఓవర్‌లో (48వ ఓవర్‌లో) 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 30 పరుగులు పిండుకున్నాడు. స్మిట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో అతను చేసిన అజేయమైన 152 పరుగుల స్కోర్ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2 చరిత్రలోనే రెండో అత్యుత్తమం.