దోహా: వచ్చే నెలలో జరిగే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత స్టార్ క్రీడాకారిణులు బరిలోకి దిగనున్నారు. డిసెంబర్ 25 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో మహిళల ర్యాపిడ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి డిఫెండింగ్ చాంపియన్‌గా పోటీపడనుంది.
గత ఏడాది న్యూయార్క్‌లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో హంపి 8.5 పాయింట్లతో విజేతగా అవతరించి రెండోసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈసారి హంపితోపాటు భారత్ నుంచి మరో 12 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి, వంతిక, పద్మిని రౌత్, సవిత శ్రీ, నందిత, నూతక్కి ప్రియాంక, ఇషా శర్మ, రక్షిత, చర్వీ తమ ఎంట్రీలను ఖరారు చేశారు. ఓపెన్ విభాగంలో భారత్ నుంచి గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద, పెంటేల హరికృష్ణ, కార్తీక్ వెంకటరామన్, రాజా రితి్వక్ తదితరులు బరిలో ఉన్నారు.


