
దివ్య దేశ్‌ముఖ్ (Divya Deshmukh).. భారత చెస్ వర్గాల్లో ప్రస్తుతం ఈ పేరు మారుమ్రోగి పోతోంది. చదరంగ దిగ్గజాలు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక (Dronavalli Harika)లకు కూడా సాధ్యం కాని అరుదైన ఘనతను దివ్య సాధించడమే ఇందుకు కారణం.
ఫిడే మహిళల ప్రపంచకప్ (FIDE Women's World Cup) ఫైనల్లో ఏకంగా హంపినే ఓడించిన దివ్య.. ఈ టైటిల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకుంది.
దూకుడు ప్రదర్శిస్తూనే
పందొమిదేళ్ల వయసులోనే ఈ మహారాష్ట్ర అమ్మాయి ఈ అరుదైన రికార్డు సాధించడం మరో విశేషం. దూకుడుగా ఎత్తులకు పైఎత్తులు వేస్తూనే.. కీలక సమయాల్లో ఒత్తిడి దరిచేరనీయకుండా ప్రశాంతంగా ఉండటం దివ్యలోని అరుదైన లక్షణం. ప్రత్యర్థి ఎంతటివారైనా ఏమాత్రం తడబాటుకు లోనుకాకుండా తన పనిని పూర్తి చేయడంలో ఆమె దిట్ట.
అందుకే భారత చదరంగ మహారాణిగా వెలుగొందుతున్న 38 ఏళ్ల హంపిని కూడా.. ఇంత చిన్నవయసులోనే దివ్య ఓడించగలిగింది. క్లాసిక్ గేమ్స్‌ను డ్రా చేసుకున్న దివ్య.. ర్యాపిడ్ రౌండ్స్‌లో మాత్రం చక్కటి ప్రదర్శనతో ఆద్యంతం సానుకూల దృక్పథంతో ముందుకు సాగి చాంపియన్‌గా అవతరించింది.
అసలైన ‘హీరో’కు కూడా క్రెడిట్
ఈ నేపథ్యంలో దివ్య దేశ్‌ముఖ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ తదితరులు దివ్యను కొనియాడగా.. తాజాగా వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ జాబితాలో చేరారు. అయితే, ఆయన దివ్యను ప్రశంసిస్తూనే ఆమె వెనుక ఉన్న అసలైన ‘హీరో’కు కూడా క్రెడిట్ ఇవ్వడం విశేషం.
ఈ మేరకు.. ‘‘ఫిడే ప్రపంచకప్-2025 విజేత దివ్య దేశ్‌ముఖ్. ఈ విజయంతో ఆమె గ్రాండ్ మాస్టర్ హోదాను కూడా పొందింది. పందొమిదేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించింది.
అయినా, ప్రతీ గ్రాండ్ మాస్టర్ వెనుక ఓ తల్లి ఉంటుంది. ఎంతో మంది ఇలాంటి స్టార్ల వెనుక అన్‌సంగ్ హీరోగా నిలబడిపోతుంది’’ అంటూ దివ్య దేశ్‌ముఖ్ తన తల్లి నమ్రతను ఆలింగనం చేసుకున్న వీడియోను ఆనంద్ మహీంద్ర పంచుకున్నారు.
ఇక ఆయన వ్యాఖ్యలతో నెటిజన్లు కూడా ఏకీభవిస్తున్నారు. ఈ సందర్భంగా చెన్నై చెస్ స్టార్లు ఆర్.ప్రజ్ఞానంద, ఆర్.వైశాలిల తల్లి నాగలక్ష్మిని గుర్తుచేస్తూ అమ్మలకు సెల్యూట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
దివ్య భావోద్వేగం
ప్రపంచకప్ గెలవగానే దివ్య తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ‘‘ఈ విజయానుభూతిని ఆస్వాదిస్తున్నాను. దీని నుంచి తేరుకునేందుకు ఇంకా కొంత సమయం పడుతుంది. ఇక్కడికి వచ్చే ముందు నాకు ఒక్క జీఎం నార్మ్ కూడా లేదు.
నేను ఎప్పుడు నార్మ్ సాధిస్తానో అని ఆలోచించేదాన్ని. కానీ ఇక్కడ ఇలా గ్రాండ్‌మాస్టర్ కావాలని నాకు రాసి పెట్టి ఉంది. నాకు ఈ ఆనందంలో మాటలు రావడం లేదు. ఈ విజయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. నా దృష్టిలో ఇది ఆరంభం మాత్రమే.
మున్ముందు ఇంకా ఇలాంటివి చాలా సాధించాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొంది. ఇక ఫైనల్ గెలవగానే తల్లి నమ్రతను హత్తుకుని దివ్య ఆనందభాష్పాలు రాల్చింది. ఆ తల్లి కూడా విజయగర్వంతో ఉప్పొంగిపోయింది. కాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన దివ్య దేశ్‌ముఖ్ తల్లిదండ్రులు నమ్రత, జితేంద్ర దేశ్‌ముఖ్. వీరిద్దరూ డాక్టర్లే!
చదవండి: ‘కోహ్లిపై వేటుకు సిద్ధమైన ఆర్సీబీ.. అతడి స్థానంలో మాజీ క్రికెటర్’
Divya Deshmukh, the Winner of the 2025 FIDE Women’s World Cup.
Through this victory she also achieves Grandmaster status.
At the age of 19.
And behind the Grandmaster is the caring mother…
As always, the unsung hero behind many stars…
pic.twitter.com/9AyeBBPbM5— anand mahindra (@anandmahindra) July 28, 2025