
మహిళల చెస్ ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన దివ్య దేశ్‌ముఖ్
ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు
ఫైనల్లో భారత్‌కే చెందిన స్టార్ ప్లేయర్ కోనేరు హంపిపై విజయం
టైబ్రేక్‌లో హంపిపై పైచేయి సాధించిన దివ్య
తాజా ప్రదర్శనతో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా ఖాయం
రూ. 43 లక్షల 38 వేల ప్రైజ్‌మనీ సొంతం
అంతర్జాతీయ చదరంగ వేదికపై మరోసారి భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్‌లో భారత్ నుంచి దివ్య దేశ్‌ముఖ్ రూపంలో తొలిసారి చాంపియన్ ఆవిర్భవించింది. తనకంటే ఎంతో మెరుగైన రేటింగ్ ఉన్న క్రీడాకారిణులు బరిలో ఉండటం... ఫేవరెట్ ముద్ర లేకపోవడం... 19 ఏళ్ల ఈ మహారాష్ట్ర అమ్మాయికి కలిసొచ్చింది. ఫలితంగా... ఆరంభం నుంచి స్వేచ్ఛగా ఆడుతూ... అందరి అంచనాలను తారుమారు చేస్తూ... మేధో క్రీడలో ఏకాగ్రతతో ఆడితే... పక్కా ప్రణాళికతో చకచకా ఎత్తులు వేస్తే... ప్రత్యర్థి ఎంతటి మేధావి అయినా... ఒకానొక దశలో ఒత్తిడికి గురై అనవసర తప్పిదాలు చేస్తారని.... చివరకు చేతులెత్తేస్తారని... దివ్య తన అద్భుతమైన ఆటతీరుతో నిరూపించింది. వెరసి తన కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఒకే గెలుపుతో... దివ్య స్వర్ణ పతకాన్ని దక్కించుకోవడంతోపాటు...మరోవైపు ఊహ కందని విధంగా గ్రాండ్‌మాస్టర్ (జీఎం) టైటిల్ హోదాను కూడా ఖాయం చేసుకోవడం విశేషం.
బతూమి (జార్జియా): అనుభవంపై యువతరం గెలిచింది. మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నీలో భారత్‌కు చెందిన అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం), 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ విజేతగా అవతరించింది. రెండు సార్లు ర్యాపిడ్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత మహిళా దిగ్గజ చెస్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, 38 ఏళ్ల కోనేరు హంపితో జరిగిన ఫైనల్లో దివ్య దేశ్‌ముఖ్ ఓవరాల్‌గా 2.5–1.5 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.
ఆదివారం క్లాసికల్ ఫార్మాట్‌లో నిరీ్ణత రెండు గేమ్‌లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు సోమవారం టైబ్రేక్ నిర్వహించారు. ర్యాపిడ్ ఫార్మాట్‌లో 15 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లు జరిగాయి. తొలి గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన దివ్య 81 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. దాంతో టైబ్రేక్‌లో తొలి గేమ్ ముగిశాక ఇద్దరూ 0.5–0.5తో సమంగా నిలిచారు. రెండో గేమ్‌ను హంపి తెల్ల పావులతో ప్రారంభించింది. ఒకానొక దశలో ఈ గేమ్ కూడా ‘డ్రా’గా ముగిసేలా అనిపించింది. చాంపియన్‌ను నిర్ధారించేందుకు మరో రెండు ర్యాపిడ్ గేమ్‌లు అవసరం పడతాయనిపించింది. అయితే సమయాభావం వల్ల కీలక దశలో హంపి ఒత్తిడికిలోనై పొరపాట్లు చేయడం... వాటిని దివ్య సది్వనియోగం చేసుకుంది.
ఫలితంగా రెండో గేమ్‌లో దివ్య 75 ఎత్తుల్లో గెలుపొంది 1.5–0.5తో విజయాన్ని ఖాయం చేసుకుంది. టైబ్రేక్‌లో తొలి రెండు ర్యాపిడ్ గేముల్లోనే విజేత తేలిపోవడంతో తదుపరి గేమ్‌లు నిర్వహించాల్సిన అవసరం రాలేదు. ఈ గెలుపుతో ప్రస్తుతం అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) టైటిల్‌తో ఉన్న దివ్యకు గ్రాండ్‌మాస్టర్ (జీఎం) టైటిల్ ఖాయమైంది. విజేత దివ్య దేశ్‌ముఖ్‌కు స్వర్ణ పతకంతోపాటు 50 వేల డాలర్లు (రూ. 43 లక్షల 38 వేలు)... రన్నరప్ హంపికి రజత పతకంతోపాటు 35 వేల డాలర్లు (రూ. 30 లక్షల 36 వేలు)... మూడో స్థానం పొందిన చైనా గ్రాండ్‌మాస్టర్ టాన్ జోంగికి కాంస్య పతకంతోపాటు 25 వేల డాలర్లు (రూ. 21 లక్షల 68 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
గాలివాటమేమీ కాదు...
46 దేశాల నుంచి మొత్తం 107 మంది ప్లేయర్లు పోటీపడ్డ ఈ ప్రపంచకప్ నాకౌట్ టోర్నీలో 2463 రేటింగ్ పాయింట్లు ఉన్న దివ్య 15వ సీడింగ్‌తో బరిలోకి దిగింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన ఈ నాగ్‌పూర్ అమ్మాయి టైటిల్ గెలిచే క్రమంలో తన కంటే ఎంతో మెరుగైన రేటింగ్ పాయింట్లు, గ్రాండ్‌మాస్టర్ హోదా ఉన్న నలుగురు ప్లేయర్లను ఓడించి ఈ విజయం గాలివాటమేమీ కాదని నిరూపించుకుంది.
ఫైనల్లో హంపి (2543 రేటింగ్ పాయింట్లు), సెమీఫైనల్లో టాన్ జోంగి (చైనా; 2546), క్వార్టర్ ఫైనల్లో ద్రోణవల్లి హారిక (భారత్; 2483), ప్రిక్వార్టర్ ఫైనల్లో జు జినెర్ (చైనా; 2547 రేటింగ్)లపై దివ్య గెలిచింది. దివ్య 2005లో జన్మించగా... హంపి 2002లోనే గ్రాండ్‌మాస్టర్ హోదా పొందింది. ఇప్పటికి రెండుసార్లు హంపి ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ (2019లో, 2024లో) నిలిచింది. ఈ నేపథ్యంలో ఫైనల్లో హంపినే ఫేవరెట్ అనుకున్నారంతా... కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ అద్భుత విజయంతో ‘దివ్య’మైన చెస్ ప్రపంచాన్ని సొంతం చేసుకుంది. విజేతగా నిలిచిన వెంటనే దివ్య తన భావోద్వేగాన్ని తల్లితో పంచుకుంది.
డాక్టర్ల ఫ్యామిలీ నుంచి...
దివ్య తల్లిదండ్రులు నమ్రత, జితేంద్ర దేశ్‌ముఖ్‌లిద్దరూ డాక్టర్లు. 2005 డిసెంబర్ 5న నాగ్‌పూర్‌లో జన్మించిన దివ్య ఐదేళ్ల ప్రాయంలో చెస్‌లో అడుగు పెట్టింది. దివ్య సోదరి బ్యాడ్మింటన్ శిక్షణకు వెళుతున్న సమయంలో అక్కడే జరుగుతున్న చెస్ శిబిరంలో దివ్య చేరింది. ఆ తర్వాత చెస్‌పై మక్కువ ఏర్పడటంతో ఆటను సీరియస్‌గా తీసుకుంది. 2020లో ఆన్‌లైన్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్న దివ్య 2021లో అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా పొందింది. ఆ తర్వాత 2022లో జాతీయ చాంపియన్‌గా నిలిచింది.
2022 చెస్ ఒలింపియాడ్‌లో వ్యక్తిగత కాంస్య పతకం... 2023లో ఆసియా చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. 2023లోనే జరిగిన టాటా స్టీల్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో హారిక, హంపి, సవితాశ్రీ, వంతిక అగర్వాల్, ఇరీనా క్రష్‌లను ఓడించిన దివ్య వరల్డ్ చాంపియన్ జు వెన్‌జున్‌తో, అనా ఉషెనినాతో గేమ్‌లు ‘డ్రా’ చేసుకొని టోర్నీ విజేతగా నిలిచింది. 2024లో గాంధీ నగర్‌లో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నెగ్గిన దివ్య... హంగేరిలో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టుకు స్వర్ణం దక్కడంలో కీలకపాత్ర పోషించింది. వ్యక్తిగత విభాగంలోనూ ఆమె బంగారు పతకాన్ని సాధించింది.
ప్రస్తుత వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్ అయిన హంపి ఓటమి ఊహించలేనిది. ఎండ్‌గేమ్‌లో ఆమె వరుసగా తప్పులు చేసింది. 54వ ఎత్తులో చిన్న పొరపాటు చేసి హంపి వెనుకబడినా... ఆమెకు కోలుకునే అవకాశం కూడా వచి్చంది. అయితే సమయాభావ ఒత్తిడి ఆమెపై ప్రభావం చూపించింది. 67వ ఎత్తు వేసే సమయానికి దివ్యకు సానుకూల పరిస్థితి ఏమీ లేదు. దీనిని హంపి జాగ్రత్తగా వేసి ఉంటే గేమ్ డ్రా వైపు వెళ్లేది. కానీ ఇక్కడే హంపి మళ్లీ మరో పెద్ద తప్పు చేసింది. కొత్త తరానికి ప్రతినిధి అయిన దివ్య కొత్తగా నేర్చుకోవడంలో, దూసుకుపోవడంలో సహజంగానే కాస్త ఎక్కువ చురుకుదనాన్ని ప్రదర్శించింది. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించిన హంపిని ఎదుర్కొనేందుకు దివ్య పక్కాగా కొత్త ప్రణాళికలతో సిద్ధమై వచ్చినట్లు కనిపించింది.
–చంద్రమౌళి, ఇంటర్నేషనల్ చెస్ ఆర్బిటర్