
విరాట్ కోహ్లి (PC: IPL/BCCI)
షాకింగ్ విషయం వెల్లడించిన మొయిన్ అలీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)- విరాట్ కోహ్లి (Virat Kohli).. ఈ రెండు పేర్లను విడదీసి చూడలేము. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభం నుంచి ఈ దిగ్గజ బ్యాటర్ ఆర్సీబీతోనే కొనసాగుతున్నాడు. జట్టు ముఖచిత్రమైన కోహ్లి వల్లే ఆర్సీబీకి అమితమైన ఫ్యాన్‌బేస్ ఏర్పడిందనడంలో సందేహం లేదు.
అయితే, కెప్టెన్‌గా ఆర్సీబీకి టైటిల్ అందించడంలో మాత్రం కోహ్లి విఫలమయ్యాడు. బ్యాటర్‌గా సత్తా చాటినా సారథిగా ట్రోఫీ అందించలేకపోయాడు. ఈ టీమిండియా మాజీ కెప్టెన్‌కు సాధ్యం కాని ఘనతను మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ ఇటీవలే సాధించాడు. ఐపీఎల్-2025లో ఆర్సీబీని విజేతగా నిలిపి తొలి టైటిల్ అందించాడు.
కోహ్లిపై వేటుకు సిద్ధమైన ఆర్సీబీ!
ఇక కెప్టెన్‌గా దారుణంగా విఫలమైన వేళ.. అంటే 2019లో కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆర్సీబీ యాజమాన్యం భావించిందంట. అంతేకాదు.. అతడి స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్‌ను సారథిగా నియమించాలనుకుందట. ఆర్సీబీ మాజీ ఆటగాడు, ఇంగ్లండ్ ప్లేయర్ మొయిన్ అలీ తాజాగా ఈ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.
‘‘గ్యారీ కిర్‌స్టెన్ కోచ్‌గా ఉన్న సమయంలో పార్థివ్ పటేల్‌ను కెప్టెన్‌గా నియమించేందుకు ప్రయత్నాలు జరిగాయి. అతడిది అద్బుతమైన క్రికెట్ బ్రెయిన్. అందుకే ఆర్సీబీ కెప్టెన్ చేయాలనుకున్నారు.
రేసులో పార్థివ్ పటేల్
ఇందుకు సంబంధించి చర్చలు కూడా జరిగాయి. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. పార్థివ్ పటేల్ కెప్టెన్ కాలేదు. అయితే, తన పేరును మాత్రం కెప్టెన్సీని సీరియస్‌గానే పరిశీలనలోకి తీసుకున్నారు’’ అని మొయిన్ అలీ ఇండియా టుడేతో పేర్కొన్నాడు.
కాగా 2019లో ఆర్సీబీ ఘోరంగా విఫలమైంది. కోహ్లి కెప్టెన్సీలో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం ఐదే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇక ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2021లో ఆర్సీబీ కెప్టెన్‌గా వైదొలిగిన కోహ్లి.. కేవలం ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
శతక ధీరుడు
కోహ్లి స్థానంలో కెప్టెన్‌గా వచ్చిన సౌతాఫ్రికా దిగ్గజం ఫాఫ్ డుప్లెసిస్ 2024 వరకు సారథిగా కొనసాగాడు. ఈ ఏడాది రజత్ పాటిదార్ ఆర్సీబీ నాయకుడిగా నియమితుడై.. తొలి ప్రయత్నంలోనే ట్రోఫీని ముద్దాడాడు. ఇదిలా ఉంటే.. కోహ్లి ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఆర్సీబీ తరఫున 267 మ్యాచ్‌లు ఆడి 8661 పరుగులు సాధించాడు. ఇందులో రికార్డు స్థాయిలో ఎనిమిది శతకాలు ఉన్నాయి.
ఇక గతేడాది అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లి.. ఇటీవలే టెస్టులకు కూడా గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం వన్డేలతో పాటు ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు.
చదవండి: ‘స్టోక్స్ చేసింది కరెక్టే.. జడ్డూ, వాషీ అలా చేయడం సరికాదు’