
ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ (FIDE World Cup) ఫైనల్లో యువ తరంగం దివ్య దేశ్‌ముఖ్ (Divya Deshmukh) సత్తా చాటింది. తెలుగు తేజం కోనేరు హంపి (Koneru Humpy)ని 2.5-1.5తో ఓడించి.. మహిళల చెస్ ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
జార్జియాలోని బతూమీ వేదికగా సోమవారం జరిగిన టై బ్రేకర్‌లో హంపీ తొలుత నల్ల పావులతో ఆడగా.. దివ్యతో కలిసి డ్రా చేసుకుంది. పదిహేను నిమిషాల పాటు సాగిన గేమ్‌లో 81 ఎత్తుల తర్వాత ఇద్దరూ డ్రాకు అంగీకరించారు.
అనంతరం పదిహేను నిమిషాల రెండో ర్యాపిడ్ మ్యాచ్‌లో 38 ఏళ్ల హంపి తెల్ల పావులతో ఆడగా.. దివ్య నల్ల పావులతో ఎత్తులు వేసింది. అయితే, ఈ టై బ్రేక్‌లో 38 ఏళ్ల హంపి చేసిన తప్పిదాల ఫలితంగా 19 ఏళ్ల దివ్య చాంపియన్‌గా అవతరించింది.
ఈ గెలుపుతో దివ్య గ్రాండ్ మాస్టర్‌గా ప్రమోషన్ పొందడంతో పాటు.. క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ఇక హంపిపై గెలిచిన అనంతరం దివ్య తీవ్ర భావోద్వేగానికి లోనైంది.
దివ్య భావోద్వేగం
‘‘ఇలా నేను గ్రాండ్ మాస్టర్ అవుతానని ఊహించలేదు. నా విధిరాతలో ఇది ఉంది. ఈ టోర్నమెంట్ ఆరంభానికి ముందు నాకు ఈ హోదా లేదు. ఈ విజయం నాకెంతో విలువైనది. ఇంకా నేను సాధించాల్సినవి చాలానే ఉన్నాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే’’ అంటూ దివ్య దేశ్‌ముఖ్ ఎమోషనల్ అయింది.
ఈ సందర్భంగా దివ్య తల్లి ఆమెను అక్కున చేర్చుకుని.. విజయ గర్వంతో ఉప్పొంగిపోయారు. దివ్య కంటే ముందు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఆర్.వైశాలి గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు.
ట్రై బ్రేకర్ ఇలా..
టైబ్రేక్‌లలో 10 నిమిషాల చొప్పున రెండు రాపిడ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ప్రతి కదలిక తర్వాత 10 సెకన్ల ఇంక్రిమెంట్ ఉంటుంది. స్కోరు సమంగా ఉంటే, ప్రతి కదలిక తర్వాత మూడు సెకన్ల ఇంక్రిమెంట్‌లతో రెండు, ఐదు నిమిషాల మ్యాచ్‌లు ఆడతారు. టై కొనసాగితే, ప్రతి కదలిక తర్వాత రెండు సెకన్ల ఇంక్రిమెంట్‌లతో మూడు నిమిషాల చొప్పున రెండు బ్లిట్జ్ మ్యాచ్‌లు ఆడాలి.
Divya Deshmukh 🇮🇳 winner of the World Chess Cup and also now a Grandmaster!pic.twitter.com/UNmgiq33qq
— Chessdom (@chessdom) July 28, 2025