
వాషింగ్టన్: ముబాదాల సిటీ డీసీ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో యూకీ–వీనస్ ద్వయం 6–3, 4–6, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్)–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆ్రస్టేలియా) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–కివీస్ ద్వయం మూడు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది.
తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో స్కప్‌స్కీ, స్మిత్ జంట కీలకదశలో పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన యూకీ–వీనస్‌లకు 19,860 డాలర్ల (రూ. 17 లక్షల 17 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.