హంపి, దివ్య విజయం | Koneru Humpy and Deshmukh shine in Womens Grand Prix Series | Sakshi
Sakshi News home page

హంపి, దివ్య విజయం

Apr 18 2025 1:07 AM | Updated on Apr 18 2025 1:07 AM

Koneru Humpy and Deshmukh shine in Womens Grand Prix Series

పుణే: అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌ ఐదో అంచె చెస్‌ టోర్నమెంట్‌లో నాలుగో రోజు భారత స్టార్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి, ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌ దివ్య దేశ్‌ముఖ్‌ మెరిశారు. హంపి వరుసగా రెండో విజయం నమోదు చేసుకోగా... దివ్య ఖాతాలో మూడో గెలుపు చేరింది. భారత్‌కే చెందిన ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి రమేశ్‌బాబుల మధ్య జరిగిన ముఖాముఖి పోరు ‘డ్రా’గా ముగిసింది. పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన హంపి 33 ఎత్తుల్లో గెలిచింది. 

మెలియా సలోమి (జార్జియా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన మహారాష్ట్ర అమ్మాయి దివ్య 77 ఎత్తుల్లో విజయాన్ని అందుకుంది. హారిక, వైశాలి మధ్య జరిగిన గేమ్‌ 34 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. బత్కుయాగ్‌ మున్‌గున్‌తుల్‌ (మంగోలియా)తో జరిగిన గేమ్‌లో నుర్గుల్‌ సలీమోవా (బల్గేరియా) 55 ఎత్తుల్లో... జు జినెర్‌ (చైనా) 39 ఎత్తుల్లో అలీనా కష్లిన్‌స్కాయా (పోలాండ్‌)పై గెలుపొందారు. 10 మంది క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. 

నాలుగో రౌండ్‌ తర్వాత జు జినెర్‌ 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... హంపి, దివ్య 3 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. హారిక, పొలీనా, మున్‌గున్‌తుల్‌ 2 పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నారు.  మరోవైపు బత్కుయాగ్‌ మున్‌గున్‌తుల్‌ (మంగోలియా) 34 ఎత్తుల్లో అలీనా కష్‌లిన్‌స్కాయా (పోలాండ్‌)పై గెలుపొందగా... జు జినెర్‌ (చైనా)–మెలియా సలోమి (జార్జియా) మధ్య గేమ్‌ 76 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది.   

Advertisement
 
Advertisement
Advertisement