
ఈ సీజన్‌లో ఆరో టైటిల్ గెలిచిన మెక్‌లారెన్ డ్రైవర్
బెల్జియం గ్రాండ్‌ప్రిలో అగ్రస్థానం సొంతం
స్పా–ఫ్రాంకోర్‌చాంప్స్ (బెల్జియం): ఫార్ములావన్ తాజా సీజన్‌లో మెక్‌లారెన్ డ్రైవర్‌ల జోరు సాగుతోంది. ఆస్కార్ పియాస్ట్రి, లాండో నోరిస్ మధ్య ఆధిక్యం చేతులు మారుతూ సాగిన బెల్జియం గ్రాండ్‌ప్రిలో పియాస్ట్రి విజయం సాధించాడు. ఈ సీజన్‌లో పియాస్ట్రికిది ఆరో విజయం కావడం విశేషం. ఆదివారం జరిగిన ఈ రేసులో పియాస్ట్రి నిరీ్ణత 44 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 25 నిమిషాల 22.601 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు.
మెక్‌లారెన్ జట్టుకే చెందిన నోరిస్ 1 గంట 25 నిమిషాల 26.016 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచాడు. పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన నోరిస్... 3.415 సెకన్ల తేడాతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. వర్షం అంతరాయం కారణంగా షెడ్యూల్ కన్నా ఆలస్యంగా ప్రారంభమైన రేసులో ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ (1 గంట 25 నిమిషాల 42.786 సెకన్లు) మూడో స్థానం దక్కించుకున్నాడు.
నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ (1 గంట 25 నిమిషాల 44.432 సెకన్లు; రెడ్‌బుల్) నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (1 గంట 26 నిమిషాల 3.280 సెకన్లు; ఫెరారీ) ఏడో స్థానానికి పరిమితమయ్యాడు. 24 రేసులో తాజా సీజన్‌లో ఇప్పటి వరకు 13 రేసులు ముగియగా... డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో పియాస్ట్రి 266 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... నోరిస్ 250 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ వెర్‌స్టాపెన్ 185 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. తదుపరి రేసు ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఆగస్టు 3న జరుగుతుంది.
