
పురుషుల 4X100 మీటర్లలో కాంస్యం
ముగిసిన ప్రపంచ యూనివర్సిటీ క్రీడలు
2 స్వర్ణాలు సహా భారత్‌కు 12 పతకాలు
రినె–రుర్ ఎసెన్ (జర్మనీ): ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో భారత స్టీపుల్‌ఛేజర్ అంకిత ధ్యాని రజత పతకంతో మెరిసింది. మహిళల 3000 మీటర్ల పోటీలో అంకిత 9 నిమిషాల 31.99 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలవగా... పురుషుల 4x100 మీటర్ల రిలేలో భారత జట్టుకు కాంస్య పతకం దక్కింది. ఆదివారంతో ఈ టోర్నీ ముగియగా... చివరి రోజు భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. ఓవరాల్‌గా ఈ క్రీడల్లో భారత్ 12 పతకాలు (2 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్యాలు) సాధించింది.
మహిళల స్టీపుల్‌చేజ్‌లో 23 ఏళ్ల అంకిత తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో వెండి వెలుగులు విరజిమ్మింది. అంతకుముందు హీట్స్‌లో అగ్రస్థానంతో ఫైనల్‌కు చేరిన అంకిత... తుది రేసులోనూ జోరు కనబర్చి మిల్లీ సెకన్ల తేడాతో స్వర్ణానికి దూరమైంది. ఈ క్రమంలో తన గత వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కంటే 7 సెకన్ల టైమింగ్‌ను మెరుగు పరుచుకోవడం విశేషం. పురుషుల 4x100 మీటర్ల రిలే టీమ్ రేసులో లాలు ప్రసాద్ భోయ్, అనిమేశ్, మణికంఠ, మృత్యం జయరాంతో కూడిన భారత జట్టు 38.89 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్య పతకం గెలుచుకుంది.
దక్షిణ కొరియా (38.50 సెకన్లు), దక్షిణాఫ్రికా (38.80 సెకన్లు) జట్లు వరుసగా స్వర్ణ, రజతాలు నెగ్గాయి. మహిళల 4్ఠ100 మీటర్ల రిలే టీమ్ విభాగంలో అనఖ బిజుకుమార్; దివ్యనిబ జాలా, రష్‌దీప్ కౌర్, రూపాల్‌తో కూడిన భారత జట్టు 2 నిమిషాల 35.8 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఐదో స్థానంలో నిలిచింది. పురుషుల 4x100 మీటర్ల రిలేలో విశాల్, అశ్విన్, జెరోమ్, బాలకృష్ణతో కూడిన భారత జట్టు 3 నిమిషాల 6.5 సెకన్లతో ఐదో స్థానానికి పరిమితమైంది.
రేస్ వాక్‌లో భారత పురుషుల, మహిళల అథ్లెట్లు టాప్–10లో చోటు దక్కించుకోలేకపోయారు. అంతకుముందు మహిళల 20 కిలోమీటర్ల రేస్‌వాక్ టీమ్ విభాగంలో సెజల్ సింగ్, మునిత ప్రజాపతి, మాన్సి నేగితో కూడిన భారత జట్టు కాంస్య పతకం నెగ్గింది.