
41 ఎత్తుల్లో తొలి గేమ్ ‘డ్రా’
నేడు ఇద్దరి మధ్య రెండో గేమ్
మహిళల ప్రపంచకప్ చెస్ ఫైనల్
బతూమి (జార్జియా): భారత్‌కు ఖాయమైన వరల్డ్‌కప్ టైటిల్‌ను తమ పరం చేసుకునేందుకు తెలుగు తేజం కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ తొలి గేమ్‌లో దీటుగా ఎత్తుకు పైఎత్తులు వేశారు. దాంతో ఈ పోరు సమంగా ముగిసింది. ‘ఫిడే’ మహిళల ప్రపంచకప్ నాకౌట్ చెస్ టోర్నమెంట్‌లో శనివారం జరిగిన తొలి గేమ్‌లో 41 ఎత్తుల తర్వాత ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు మొగ్గు చూపారు. ఈ పోరులో నల్ల పావులతో బరిలోకి దిగిన హంపికి ఓపెనింగ్ ఎత్తుగడలేవీ కలిసి రాలేదు.
గేమ్‌ను మొదలుపెట్టిన వ్యూహం, వేసిన ఎత్తులు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్‌ను కాస్త ఇరకాటంలో పెట్టాయి. దీంతో తెల్ల పావులతో ఆడుతున్న దివ్యకు అవి అదనపు బలాన్నిచ్చేలా చేశాయి. దీంతో 14వ ఎత్తు వరకు గేమ్ దివ్య నియంత్రణలోనే ఉంది. అయితే ఈ దశలో తేరుకున్న హంపి జాగ్రత్త పడింది. ఎత్తుగడ మార్చి పైఎత్తులతో గేమ్‌పై పట్టు పెంచుకుంది. దీంతో అక్కడి నుంచి ఆట పోటాపోటీగా సాగడంతో చివరకు డ్రా తప్పలేదు.
ఇంటర్నేషనల్ మాస్టర్, 19 ఏళ్ల దివ్య ఒక దశలో వెటరన్ గ్రాండ్‌మాస్టర్‌కు చెమటలు పట్టించింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ప్రయత్నించని డి4 గడి నుంచి ఓపెనింగ్ చేసిన దివ్య ఎత్తులు, చకచకా పావులు కదుపుతున్న తీరు ఆమె ఫైనల్ కోసం బాగా సన్నద్ధమైందనిపించింది. హంపిని ఒత్తిడికి గురి చేసేందుకు ఎత్తులకు పదునుపెట్టే క్రమంలో చాలా సమయం తీసుకుంది. మరో వైపు అనుభవజు్ఞరాలైన హంపి ఆరంభంలో ప్రత్యర్థి చురుకైన ఎత్తులకు ఏమాత్రం కంగారు పడకుండా తన గేమ్ ప్లాన్‌ను అమలు చేసింది.
ఈ క్రమంలో ఆరంభంలో కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఒత్తిడికి గురి కాలేదు. గేమ్ మధ్యలో పట్టు చిక్కించుకున్న హంపి... దివ్య జోరును అడ్డుకుంది. ఈ సమయంలో దివ్య గెలుస్తానన్న ధీమాతో డ్రాకు అంగీకరించలేదు. చివరకు గేమ్ సాగే కొద్దీ ఫలితంపై ఆశలు లేకపోవడంతో దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ గేమ్ 41వ ఎత్తుల్లో డ్రా అయ్యింది. ఫైనల్‌లో భాగంగా నేడు రెండో గేమ్ జరుగుతుంది. ఇందులో గెలిచినవారు ప్రపంచ విజేతగా నిలుస్తారు. ఒకవేళ ఫలితం రాకపోతే రేపు టైబ్రేక్ ద్వారా చాంపియన్‌ను తేలుస్తారు.