ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ బరిలో హంపి
దోహా: ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలకు నేడు తెరలేవనుంది. తొలి మూడు రోజులు ర్యాపిడ్ విభాగం గేమ్‌లు... ఆ తర్వాత రెండు రోజులు బ్లిట్జ్ విభాగం గేమ్‌లు జరుగుతాయి. మహిళల ర్యాపిడ్ విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. 2019, 2024లలో ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌గా నిలిచిన హంపి మూడోసారి ఈ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉంది.
మహిళల విభాగంలో భారత్ నుంచి హంపితోపాటు ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి, వంతిక, పద్మిని రౌత్, సవితా శ్రీ, నందిత, నూతక్కి ప్రియాంక, ఇషా శర్మ, రక్షిత, పర్ణాలి, చర్వీ పోటీపడుతున్నారు. ఓపెన్ విభాగంలో భారత్ నుంచి ఇరిగేశి అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద, పెంటేల హరికృష్ణతోపాటు మరో 25 మంది గ్రాండ్‌మాస్టర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.
ఓపెన్ ర్యాపిడ్ విభాగంలో 13 రౌండ్లు... మహిళల ర్యాపిడ్ విభాగంలో 11 రౌండ్లు నిర్వహిస్తారు. ఓపెన్ బ్లిట్జ్ విభాగంలో 19 రౌండ్లు... మహిళల బ్లిట్జ్ విభాగంలో 15 రౌండ్లు ఉంటాయి. బ్లిట్జ్ విభాగంలో నిర్ణీత రౌండ్లు ముగిశాక టాప్–4లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ర్యాపిడ్ విభాగంలో మాత్రం అత్యధిక పాయింట్లు సాధించిన వారికి టైటిల్ లభిస్తుంది. ఓపెన్, మహిళల ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల విజేతలకు 70 వేల యూరోల (రూ. 74 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తుంది.


