గొప్పగా హాకీ ‘శత’ వసంతం | Arrangements to celebrate Indias golden jubilee of hockey in a grand manner | Sakshi
Sakshi News home page

గొప్పగా హాకీ ‘శత’ వసంతం

Jul 28 2025 4:34 AM | Updated on Jul 28 2025 4:34 AM

Arrangements to celebrate Indias golden jubilee of hockey in a grand manner

పండగగా హాకీ స్వర్ణోత్సవం

రాష్ట్ర సంఘాలకు గ్రాంట్లు పెంపు

టోర్నీ నిర్వహణకు నిధుల హెచ్చింపు

మహాబలిపురం: భారత హాకీ స్వర్ణోత్సవాన్ని (వందేళ్ల పండగను) గొప్పగా నిర్వహించేందుకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఏర్పాట్లు చేస్తోంది. అలాగే శత వసంతం సందర్భంగా రాష్ట్ర హాకీ సంఘాలకు నిధుల వితరణను పెంచింది. సీనియర్, జూనియర్‌ అంతర్జాతీయ, జాతీయ, మహిళల టోర్నీల నిర్వహణ కోసం అందజేసే గ్రాంట్ల మొత్తాన్ని కూడా గణనీయంగా హెచ్చింపు చేసింది. క్షేత్రస్థాయిలో జరిగే ఈవెంట్ల నిర్వహణను ప్రోత్సహించేలా ఆర్థిక సాయాన్ని పెంచింది. 

ఏదేని రాష్ట్రంలో ఇకపై పురుషుల, మహిళల సీనియర్‌ జాతీయ చాంపియన్‌షిప్‌ జరిగితే రూ. 70 లక్షలు గ్రాంట్‌గా అందజేయనుంది. అదే జూనియర్, సబ్‌–జూనియర్‌ స్థాయి ఈవెంట్‌లను నిర్వహిస్తే రూ. 30 లక్షలు ఇవ్వనున్నట్లు హెచ్‌ఐ ప్రకటించింది. దీంతో పాటు రాష్ట్ర స్థాయి, జిల్లా టోర్నీల నిర్వహణ కోసం రూ. 25 లక్షలు ఇస్తామని ప్రకటించింది. నవంబర్‌ 7న దేశవ్యాప్తంగా హాకీ వందేళ్ల స్వర్ణోత్సవ సంబరాన్ని అంబరాన్నంటేలా నిర్వహిస్తారు. 

భవిష్యత్తుకు భరోసా కల్పించేలా... 
నిధుల పెంపుదలతో ఆయా రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు మరింత పెరిగేందుకు దోహదం చేస్తుంది. దీంతో పాటు ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించే ఆరి్థక వెసులుబాటు కలుగుతుందని హెచ్‌ఐ భావిస్తోంది. దీంతో టోర్నీ ఆకర్షణీయగా మారుతుంది. అదనపు హంగులతో నిర్వహించబడుతుంది. నిష్ణాతులైన రిఫరీలు, అధికారుల మార్గదర్శనంలో జరగడం వలన పోటీల నాణ్యత కూడా పెరుగుతుంది. ప్లేయర్లకు వసతులు పెరుగుతాయి. 

కొత్తగా మరెంతో మంది ఉత్సాహంగా హాకీ క్రీడను కెరీర్‌గా ఎంచుకుంటారు. ఇలా బహుముఖ ప్రయోజనాలు కలుగుతాయని హాకీ ఇండియా బలంగా నమ్ముతోంది. ఆటగాళ్లే కాదు హాకీ క్రీడ కోసం పనిచేసే అధికారులు, కోచ్‌లు, ఫిజియోలకు ఒనగూరే ప్రయోజనాలూ ఇందులో ఇమిడి ఉంటాయి. వీళ్లందరి భవిష్యత్తుకు భరోసా పెరుగుతుంది.  

ఒకేసారి 1000 మ్యాచ్‌ల నిర్వహణ 
శత వసంతాల హాకీ మైలురాయి ఘనతకు గుర్తుగా జాతీయ స్థాయి వేడుకలే కాదు... పోటీలు కూడా హాకీని మరింత శోభాయమానం చేయనుంది. ‘హాకీ–100’ను చిరస్మరణీయంగా మలిచేందుకు మహిళలు, పురుషుల విభాగాల్లో ఒకే సమయం దేశ వ్యాప్తంగా వెయ్యి చొప్పున మ్యాచ్‌ల్ని నిర్వహించేందుకు హెచ్‌ఐ ఏర్పాట్లు చేస్తోంది.

మహిళల్లో, పురుషుల్లో 18 వేల మంది చొప్పున ఏకంగా 36 వేలమంది క్రీడాకారులు ఈ పోటీల్లో ఒకేసారి పాల్గొనబోతున్నారు. మన హాకీ స్వర్ణ శకం వెయ్యేళ్లు గుర్తుండిపోయేలా, భవిష్యత్‌ తరాలకు మన హాకీ ప్రభ, శోభ తెలిసేలా వందేళ్ల వేడుక ఉంటుందని హెచ్‌ఐ అధ్యక్షుడు దిలిప్‌ టిర్కీ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement