
బతూమి (జార్జియా): తాడోపేడో తేల్చుకోవాల్సిన గేమ్‌లలో భారత చెస్ స్టార్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, దివ్య దేశ్‌ముఖ్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ప్రపంచకప్ మహిళల నాకౌట్ చెస్ టోర్నీలో ఈ నలుగురూ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో గురువారం నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత భారత క్రీడాకారిణులు తమ ప్రత్యర్థులతో 1–1తో సమంగా నిలిచారు. దాంతో విజేతలను నిర్ణయించేందుకు శుక్రవారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు.
టైబ్రేక్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హంపి 1.5–0.5తో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (స్విట్జర్లాండ్)పై... హైదరాబాద్ ప్లేయర్ హారిక 2.5–1.5తో ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ మాజీ చాంపియన్ కాటరీనా లాగ్నో (రష్యా)పై... తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ వైశాలి 3.5–2.5తో మెరూర్ట్ కమలిదెనోవా (కజకిస్తాన్)పై... ప్రపంచ జూనియర్ చాంపియన్, మహారాష్ట్ర అమ్మాయి దివ్య దేశ్‌ముఖ్ 1.5–0.5తో ఆసియా క్రీడల చాంపియన్ జు జినెర్ (చైనా)పై విజయం సాధించారు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో యుజిన్ సాంగ్ (చైనా)తో హంపి; దివ్య దేశ్‌ముఖ్‌తో హారిక; టాన్ జోంగీ (చైనా)తో వైశాలి తలపడతారు.