
మహిళల యూరో ఫుట్‌బాల్ టోర్నీ టైటిల్ నిలబెట్టుకున్న ఇంగ్లండ్
ఫైనల్లో పెనాల్టీ ‘షూటౌట్’లో 3–1తో స్పెయిన్‌పై గెలుపు
తుది పోరులో గల్లంతైన స్పెయిన్ ఆశలు
బాసెల్: డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ మహిళల జట్టు యూరో ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నిలబెట్టుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన హోరాహోరీ తుది పోరులో ఇంగ్లండ్ జట్టు పెనాల్టీ షూటౌట్‌లో 3–1తో స్పెయిన్‌పై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఆఖరి క్షణం దాకా పోటా
పోటీగా పోరాడిన స్పెయిన్ పెనాల్టీ షూటౌట్‌లో అనూహ్యంగా చిత్తయ్యింది. కేవలం ఒకే ఒక్క స్ట్రయికర్ గోల్ చేయడం గమనార్హం.
మరోవైపు ఇంగ్లండ్ బృందంలో ఇద్దరు బంతిని లక్ష్యాన్ని చేర్చడంలో విఫలమవగా... ముగ్గురు గోల్స్ చేశారు. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి ఇంగ్లండ్, స్పెయిన్ జట్లు 1–1 స్కోరుతో సమఉజ్జీలుగా నిలిచాయి. ముందుగా స్పెయిన్ శిబిరం నుంచి గోల్ నమోదైంది. తొలి అర్ధభాగంలోనే మరియాన కాల్డెంటే (25వ నిమిషంలో) గోల్ చేసి జట్టుకు శుభారంభాన్నిచి్చంది. 1–0తో ఆధిక్యంతోనే ప్రథమార్ధాన్ని ముగించింది. ద్వితీయార్ధం మొదలవగానే ఇంగ్లండ్ ప్లేయర్లు దాడులకు పదును పెట్టారు.
ఈ క్రమంలో అలెసియా రుసో (57వ నిమిషంలో) గోల్ చేసి స్కోరును 1–1తో సమం చేసింది. తర్వాత ఇరుజట్ల ప్లేయర్లు ఎంతగా శ్రమించిన ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. నిరీ్ణత సమయంలో ఫలితం తేలకపోవడంతో అదనపు సమయం ఆడించారు. అయినా... స్కోరులో ఏ మార్పు లేకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇక్కడ తొలి షాట్ నుంచే ‘డ్రా’ మొదలైంది. స్పెయిన్ ఒకటే గోల్ చేసినా... ఇంగ్లండ్ గెలిచేందుకు ఆఖరి షాట్ గోల్‌దాకా వేచిచూడక తప్పలేదు. ఎందుకంటే మొదట కిక్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ జట్టులో బెత్ మీడ్ విఫలమైంది.
స్పెయిన్ తరఫున ప్యాట్రిసియా గూజారో గోల్ కొట్టడంతో నిరీ్ణత సమయం మ్యాచ్‌లోలానే 1–0తో ‘షూటౌట్’లోనూ తొలుత పైచేయి సాధించింది. అయితే ఇంగ్లండ్ ప్లేయర్లు అలెక్స్ గ్రీన్‌వుడ్, నియామి చార్లెస్‌లు వరుసగా షాట్లు కొట్టడంతో రేసులో పడగా... మరోవైపు స్పెయిన్ శిబిరంలో మరియానా, ఐతాన బొన్‌మటి విఫలమవడంతో ఇంగ్లండ్ అనూహ్యంగా 2–1తో ఆధిక్యంలోకి దూసుకొచి్చంది. నాలుగో షాట్ లియా విలియమ్సన్ (ఇంగ్లండ్), సాల్మ పారాల్యులో (స్పెయిన్) ఎవరి వల్లా కాలేదు. 2–1తో ఇక ఆఖరి ప్రయత్నానికి సిద్ధమయ్యారు. ఒకవేళ ఇంగ్లండ్ ఐదో షాట్ విఫలమై, స్పెయిన్ చేసి ఉంటే 2–2తో సమమై విజేత కోసం డ్రామా కొనసాగేది. కానీ క్లో కెల్లీ (ఇంగ్లండ్) స్పెయిన్‌కు ఆ ఆఖరి ఛాన్స్ ఇవ్వకుండా గోల్ చేసింది. 3–1తో ఫలితం రావడంతో స్పెయిన్ ఆఖరి షాట్ తీసుకోలేదు. 2022లో జరిగిన అమ్మాయిల యూరోలోనూ ఇంగ్లండే చాంపియన్‌గా నిలిచింది.
స్టేడియానికి ‘రాయల్’ కళ
సెయింట్ జాకబ్ పార్క్‌లో జరిగిన ఈ టైటిల్ పోరుకు ‘రాయల్’ హాజరు లభించింది. తుదిపోరును ప్రత్యక్షంగా తిలకించేందుకు బ్రిటన్ యువరాజు విలియమ్స్ (కింగ్ చార్లెస్ తనయుడు) కుమార్తె ప్రిన్సెస్ చార్లట్‌తో విచ్చేశారు. ప్రిన్స్ విలియమ్స్ ఇంగ్లిష్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు స్పెయిన్ రాజవంశానికి చెందిన యువరాణి ప్రిన్సెస్ లియోనర్ తన సోదరి ఇన్‌ఫాంటా సోఫియాతో కలిసి టైటిల్ పోరును వీక్షించింది. సోఫియా 2023లో సిడ్నీలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌ను తల్లి, స్పెయిన్ రాణి లెటిజియాతో కలిసి వీక్షించింది. ఆ మ్యాచ్‌లో స్పెయిన్ విజేతగా నిలిచింది. మొత్తానికి 2023 ప్రపంచకప్, 2024 యూఈఎఫ్‌ఏ నేషన్స్ లీగ్ టైటిళ్లతో జోరుమీదున్న స్పెయిన్ వరుసగా మూడో ఏడాది ప్రతిష్టాత్మక టైటిల్ గెలవాలనే గంపెడాశలతో బరిలోకి దిగింది. కానీ తుదిమెట్టుపై చతికిలబడింది. దీంతో ‘యూరో’ కప్ స్పెయిన్ మహిళల జట్టుకు ఇన్నేళ్లయినా అందని ద్రాక్షగానే ఉంది.