భారత్, న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచి (జనవరి 21) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే జియో హాట్‌స్టార్ యాప్ మరియు వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.
షెడ్యూల్..
తొలి టీ20- నాగ్‌పూర్
రెండో టీ20- రాయ్‌పూర్
మూడో టీ20- గౌహతి
నాలుగో టీ20- విశాఖపట్నం
ఐదో టీ20- తిరువనంతపురం
ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకే, పైన పేర్కొన్న మాధ్యమాల ద్వారానే ప్రత్యక్ష ప్రసారమవుతాయి.
జట్లు..
భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి
న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మార్క్ చాప్‌మన్, టిమ్ రాబిన్సన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డారిల్ మిచెల్, బెవాన్ జాకబ్స్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, జకరీ ఫౌల్క్స్, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ, కైల్ జేమీసన్, ఐష్ సోది, క్రిస్టియన్ క్లార్క్
ఈ సిరీస్ ప్రారంభ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లు, వాటి ఫలితాలు, అందులోని విశేషాలపై ఓ లుక్కేద్దాం.
భారత్, న్యూజిలాండ్ మధ్య ఇప్పటివరకు 8 ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లు జరిగాయి. ఇందులో న్యూజిలాండ్ మూడు, భారత్ ఐదింట విజయాలు సాధించింది. ఇరు జట్ల మధ్య 2008-09లో తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.
ఆతర్వాత 2012లో న్యూజిలాండ్ తొలిసారి టీ20 సిరీస్ ఆడేందుకు భారత్‌లో పర్యటించింది. 2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను కూడా న్యూజిలాండే కైవసం చేసుకుంది (1-0).
అనంతరం 2017-18లో న్యూజిలాండ్ మరోసారి భారత్‌లో పర్యటించింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌కు భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకొని, తొలిసారి న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్ విక్టరీ సాధించింది.
ఆ మరుసటి ఏడాది (2018-19) భారత్ న్యూజిలాండ్‌లో పర్యటించి, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌ను ఆతిథ్య జట్టే 2-1 తేడాతో చేజిక్కించుకుంది.
2019-20లో భారత్ మరోసారి న్యూజిలాండ్‌లో పర్యటించింది. ఈ పర్యటన భారత టీ20 క్రికెట్ చరిత్రలో చిరకాలం గుర్తుండిపోతుంది. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ 5-0తో క్లీన్ స్వీప్ చేసి, ఆతిథ్య జట్టుకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. విరాట్ కోహ్లి టీ20 కెరీర్‌లోనూ ఈ సిరీస్ చిరస్మరణీయంగా మిగిలిపోయింది.
అనంతరం 2021-22లో న్యూజిలాండ్ 3 మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించింది. ఈ సిరీస్‌ను కూడా భారత్ క్లీన్‌స్వీప్ (3-0) చేసింది.
2022-23లో ఇరు జట్ల మధ్య రెండు సార్లు ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగాయి. రెండు సిరీస్‌లను టీమిండియానే కైవసం చేసుకుంది. తొలుత పర్యాటక జట్టుగా 1-0తో.. ఆతర్వాత ఆతిథ్య జట్టుగా 2-1తో సిరీస్‌లను కైవసం చేసుకుంది.
శుభ్‌మన్ గిల్ విధ్వంసకర శతకం
ఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మ్యాచ్‌లో ప్రస్తుత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన భారత వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో గిల్ 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 126 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌ను 168 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి సిరీస్‌ను కైవసం చేసుకుంది.


