
క్రికెట్‌లో భారత్-పాకిస్తాన్‌ల మధ్య సమరం తర్వాత, ఆ స్థాయి ఉత్కంఠతతో సాగే మ్యాచ్‌లు ఏవైనా ఉంటాయా అంటే, అవి ఇంగ్లండ్-ఆసీస్‌ల మధ్య జరిగే మ్యాచ్‌లే అని చెప్పాలి. ఫార్మాట్ ఏదైనా ఇంగ్లండ్-ఆసీస్ మ్యాచ్‌లు.. భారత్-పాక్‌ల మధ్య జరిగే మ్యాచ్‌లతో సమానంగా ఆసక్తిని రేకెత్తిస్తాయి. దాయాదుల సమరంలో ఏరకంగా అయితే భావోద్వేగాలు ముడిపడి ఉంటాయో.. ఇంచుమించు అదే స్థాయిలో ఇంగ్లండ్-ఆసీస్‌ల మధ్య జరిగే మ్యాచ్‌ల్లోనూ ఎమోషన్స్ నెలకొని ఉంటాయి.
ఇంగ్లండ్-ఆసీస్ మ్యాచ్‌లకు దాయాదుల సమరానికి దక్కిన ఆదరణ దక్కడానికి ప్రధాన కారణం యాషెస్ సిరీస్. ఇంగ్లండ్-ఆసీస్‌ల మధ్య 141 కిందట మొదలైన ఈ ఆధిపత్య పోరులో ఇప్పటివరకు మొత్తం 72 సిరీస్‌లు జరగ్గా ఆస్ట్రేలియా 34 సార్లు, ఇంగ్లండ్ 32 సందర్భాల్లో యాషెస్ ట్రోఫీని సొంతం చేసుకున్నాయి. 6 సందర్భాల్లో సిరీస్‌లు డ్రాగా ముగిసాయి. మ్యాచ్‌ల ప్రకారం చూస్తే.. యాషెస్‌లో మొత్తం 340 మ్యాచ్‌లు జరగ్గా ఆస్ట్రేలియా 140, ఇంగ్లండ్ 108 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. 92 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి.
సిరీస్ ప్రారంభమైన కొత్తలో 8 వరుస సిరీస్‌లను ఇంటా బయటా అన్న తేడాతో లేకుండా ఇంగ్లండ్ సొంతం చేసుకోగా.. 1891/92 సీజన్‌లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసింది. స్వదేశంలో జరిగిన ఈ 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్ 2-1 తేడాతో గెలుచుకుని సంచలనం సృష్టించింది. ఆతర్వాత మళ్లీ ఇంగ్లండ్ హ్యాట్రిక్ సిరీస్ విజయాలు సాధించగా.. అనంతరం ఆసీస్ వరుసగా నాలుగు సిరీస్‌ల్లో విజయాలు సాధించి, ఇంగ్లండ్ ఆధిపత్యాన్ని తగ్గించింది.
1902 తర్వాత యాషెస్ సిరీస్ సాగే తీరులో మార్పు వచ్చింది. ఇంగ్లండ్ ఆధిపత్యానికి ఆసీస్ ఆటగాళ్లు గండికొట్టడం మొదలుపెట్టారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆసీస్ చాలా మెరుగయ్యింది. తదనంతరం డాన్ బ్రాడ్‌మన్ శకం (1928-48) మొదలు కావడంతో సీన్ రివర్సై ఇంగ్లండ్‌పై ఆసీస్ ఆధిపత్యం చలాయించడం మొదలుపెట్టింది. మధ్యమధ్యలో ఇంగ్లండ్ అడపాదడపా విజయాలు సాధించినప్పటికీ, ఆసీస్‌దే పైచేయిగా నిలిచింది.
ఆసీస్ క్రికెట్‌లో స్వర్ణయుగంగా చెప్పుకునే 1989-2003 మధ్యకాలంలో ఆసీస్ ఏకచత్రాధిపత్యం కొనసాగించింది. ఈ మధ్యకాలంలో జరిగిన 8 సిరీస్‌ల్లో ఆసీసే విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన 2005 సిరీస్.. యాషెస్ చరిత్రలోనే అత్యుత్తమమై సిరీస్‌గా విశ్లేషకులు అభివర్ణిస్తుంటారు. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను మైఖేల్ వాన్ నేతృత్వంలోని ఇంగ్లండ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇక చివరిగా 2021/22లో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-0 తేడాతో గెలుచుకుని యాషెస్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
యాషెస్ 2023 షెడ్యూల్..
తొలి టెస్ట్: జూన్ 16-20
రెండో టెస్ట్: జూన్ 28-జులై 2
మూడో టెస్ట్: జులై 6-10
నాలుగో టెస్ట్: జులై 19-23
ఐదో టెస్ట్: జులై 27-31