Hazlewood To Replace Boland In 4th Ashes Test - Sakshi
Sakshi News home page

Ashes 4th Test: వార్నర్‌కు కెప్టెన్‌ మద్దతు.. ఆసీస్‌ జట్టులో ఓ మార్పు

Published Tue, Jul 18 2023 7:00 PM

Hazlewood To Replace Boland In 4th Ashes Test - Sakshi

మాంచెస్టర్‌ వేదికగా జులై 19 నుంచి ప్రారంభంకానున్న యాషెస్‌ సిరీస్‌ నాలుగో టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) తుది జట్టును ఇదివరకే ప్రకటించింది. అయితే తుది జట్టును ప్రకటించే విషయంలో ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ మాత్రం వేచి చూచే ధోరణిని ప్రదర్శిస్తుంది. మరికొద్ది గంటల్లో మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉండగా.. ఆ జట్టు కెప్టెన్‌ కమిన్స్‌ కేవలం లీకులు ఇచ్చాడు. తుది జట్టును మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

తొలి 3 టెస్ట్‌ల్లో విఫలమైన వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు కమిన్స్‌ అండగా నిలిచాడు. వార్నర్‌ కీలకమైన నాలుగో టెస్ట్‌లో ఆడతాడని చెప్పకనే చెప్పాడు. వార్నర్‌ గతంలో చాలా సందర్భాల్లో కీలక సమయాల్లో ఫామ్‌ను అందుకని తమను గెలిపించాడని ప్రీ మ్యాచ్‌ మీడియా కాన్ఫరెన్స్‌లో ప్రస్తావించాడు. దీన్ని బట్టి చూస్తే నాలుగో టెస్ట్‌ కోసం వార్నర్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యిందన్న విషయం అర్ధమవుతుంది.

తుది జట్టులో ఓ మార్పు విషయంపై కూడా కమిన్స్‌ నోరు విప్పాడు. మూడో టెస్ట్‌లో ఆశించినంత ప్రభావం చూపని స్కాట్‌ బోలండ్‌ స్థానాన్ని అనుభవజ్ఞుడైన హాజిల్‌వుడ్‌ భర్తీ చేస్తాడని తెలిపాడు. తుది జట్టులో మరేమైనా మార్పులుంటాయన్న ప్రశ్నకు  కమిన్స్‌ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. తుది జట్టు ప్రకటనపై తొందరేం లేదని, మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు ఆ ప్రకటన ఉంటుందని కాన్ఫరెన్స్‌ను కంక్లూడ్‌ చేశాడు.

మరి కమిన్స్‌ చెప్పినట్లుగా వార్నర్‌ కొనసాగుతాడో లేదో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. మరో పక్క ఇంగ్లండ్‌ మాత్రం తమ తుది జట్టును నిన్ననే ప్రకటించింది. ఓపెనర్లుగా బెన్‌ డకెట్‌, జాక్‌ క్రాలే, వన్‌డౌన్‌లో మొయిన్‌ అలీ, నాలుగో ప్లేస్‌లో జో రూట్‌, ఆతర్వాత హ్యారీ బ్రూక్‌, బెన్‌ స్టోక్స్‌, జోనాథన్‌ బెయిర్‌స్టో, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌ వుడ్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ ఆండర్సన్‌ వరుస స్థానాల్లో ఉంటారని తెలిపింది.

ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల ఈ యాషెస్‌ సిరీస్‌లో పర్యాటక ఆసీస్‌ ప్రస్తుతానికి 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్‌ గెలువగా.. హోరాహోరీగా సాగిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ పైచేయి సాధించింది. బజ్‌బాల్‌ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్‌ తొలి రెండు టెస్ట్‌లో బొక్కబోర్లా పడటంతో మూడో టెస్ట్‌లో కాస్త జాగ్రత్తగా ఆడి విజయం సాధించింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement