చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్‌.. ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు

Harry Brook Is The Only Player To Have Scored A Century In PSL, IPL And The Hundred League - Sakshi

ఇంగ్లండ్‌ యువ కెరటం హ్యారీ బ్రూక్‌ చరిత్ర సృష్టించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL), పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL), ద హండ్రెడ్‌ లీగ్‌ (THL)ల్లో సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. బ్రూక్‌కు ముందు ఈ మూడు లీగ్‌ల్లో సెంచరీలు చేసిన ఆటగాడే లేడు. హండ్రెడ్‌ లీగ్‌లో నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన బ్రూక్‌ నిన్న (ఆగస్ట్‌ 22) వెల్ష్‌ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో (42 బంతులు 105; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) కదంతొక్కాడు. ఈ సెంచరీ హండ్రెడ్‌ లీగ్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ (41) కావడం విశేషం.
 
దీనికి ముందు బ్రూక్‌ 2023 ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై శతకం (55 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదాడు. ఈ సెంచరీతో బ్రూక్‌ సన్‌రైజర్స్‌  యంగెస్ట్‌ సెంచూరియన్‌గానూ రికార్డుల్లోకెక్కాడు. 2023 ఐపీఎల్‌కు ముందు సన్‌రైజర్స్‌ బ్రూక్‌ను 13.25 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది.

పై పేర్కొన్న మూడు లీగ్‌ల్లో (ఐపీఎల్‌, పీఎస్‌ఎల్‌, హండ్రెడ్‌) బ్రూక్‌ తన తొలి సెంచరీని పీఎస్‌ఎల్‌లో సాధించాడు. 2022 పీఎస్‌ఎల్‌లో బ్రూక్‌, లాహోర్‌ ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ.. ఇస్లామాబాద్‌ యునైటెడ్‌పై శతక్కొట్టాడు (49 బంతుల్లో 102 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు).

 ఓవరాల్‌గా బ్రూక్‌ కెరీర్‌ చూసుకుంటే, 2022 జనవరిలో విండీస్‌తో జరిగిన టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 12 టెస్ట్‌ల్లో 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలతో 1181 పరుగులు.. 3 వన్డేల్లో ఫిఫ్టి సాయంతో 86 పరుగులు, 20 టీ20ల్లో హాఫ్‌ సెంచరీ సాయంతో 372 పరుగులు చేశాడు. బ్రూక్‌ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరఫున 11 మ్యాచ్‌ల్లో సెంచరీ సాయంతో 190 పరుగులు చేశాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top