చరిత్ర సృష్టించిన హర్మన్‌ | Harmanpreet Kaur becomes 1st Indian to score 1000 WPL runs | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన హర్మన్‌

Jan 14 2026 12:26 PM | Updated on Jan 14 2026 12:38 PM

Harmanpreet Kaur becomes 1st Indian to score 1000 WPL runs

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. లీగ్‌ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కింది. నిన్న (జనవరి 13) గుజరాత్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. 

ఈ మ్యాచ్‌లో హర్మన్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ (43 బంతుల్ల 71 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి, తన జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చింది. ఈ ఇన్నింగ్స్‌ తర్వాత WPLలో హర్మన్‌ పరుగుల సంఖ్య 1016కు (29 ఇన్నింగ్స్‌ల్లో 46.18 సగటు, 146.18 స్ట్రైక్ రేట్) చేరింది.

ఈ ఇన్నింగ్స్‌తో హర్మన్‌ మరో రికార్డు కూడా సాధించింది. WPL చరిత్రలో అత్యధిక హాఫ్‌ సెంచరీలు (10) చేసిన బ్యాటర్‌గానూ రికార్డు నెలకొల్పింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనకు గానూ ప్లేయర్‌ ఆఫ​్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్న హర్మన్, ఈ విభాగంలో తన రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. 

WPLలో హర్మన్‌కు ఇది తొమ్మిదో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు. WPL చరిత్రలో ఏ ప్లేయర్‌ కూడా ఐదుకు మించి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు అందుకోలేదు. గత మ్యాచ్‌లోనూ (ఢిల్లీ క్యాపిటల్స్‌పై) హర్మన్‌ అజేయమైన అర్ద సెంచరీ చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకుంది.

ఓవరాల్‌గా చూసినా WPL చరిత్రలో హర్మన్‌ కాకుండా ఒకే ఒకరు 1000 పరుగుల మైలురాయిని తాకారు. హర్మన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కే చెందిన నాట్‌ సీవర్‌ బ్రంట్‌ 1000 పరుగుల మైలురాయిని తాకింది. బ్రంట్‌ ప్రస్తుతం 1101 పరుగులతో కొనసాగుతుంది. 

భారతీయులకు సంబంధించి హర్మన్‌ తర్వాత అత్యధిక WPL పరుగులు చేసిన ప్లేయర్లుగా షఫాలీ వర్మ (887), స్మృతి మంధన (711) ఉన్నారు. హాఫ్‌ సెంచరీల రికార్డుకు సంబంధించి హర్మన్‌ తర్వాత అత్యధికంగా బ్రంట్‌, లాన్నింగ్‌ తలో 9 హాఫ్‌ సెంచరీలు చేశారు. భారతీయులకు సంబంధించి షఫాలీ 6, మంధన 4 అర్ద సెంచరీలు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement