హర్‌దీప్‌ ‘పసిడి’ పట్టు | Hardeep wins gold in Greco Roman 110kg category | Sakshi
Sakshi News home page

హర్‌దీప్‌ ‘పసిడి’ పట్టు

Jul 31 2025 4:11 AM | Updated on Jul 31 2025 4:11 AM

Hardeep wins gold in Greco Roman 110kg category

గ్రీకో రోమన్‌ 110 కేజీల విభాగంలో స్వర్ణం సొంతం

ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయ రెజ్లర్‌గా గుర్తింపు

అండర్‌–17 ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ 

ఏథెన్స్‌ (గ్రీస్‌): అందరి అంచనాలను తారుమారు చేస్తూ... ప్రపంచ అండర్‌–17 రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ గ్రీకో రోమన్‌ స్టయిల్‌లో భారత యువ రెజ్లర్‌ హర్‌దీప్‌ స్వర్ణ పతకం సాధించి సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన 110 కేజీల విభాగం ఫైనల్లో హర్‌దీప్‌ 3–3 పాయింట్లతో యజ్దాన్‌ రెజా డెల్‌రూజ్‌ (ఇరాన్‌)పై గెలుపొందాడు. ఇద్దరి స్కోర్లు సమమైనప్పటికీ... నిబంధనల ప్రకారం చివరి పాయింట్‌ హర్‌దీప్‌ సాధించడంతో భారత రెజ్లర్‌కు స్వర్ణం ఖరారైంది.

యజ్దాన్‌కు రజతం దక్కింది. ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో గ్రీకో రోమన్‌ స్టయిల్‌లో భారత్‌కు బంగారు పతకాన్ని అందించిన నాలుగో రెజ్లర్‌గా 16 ఏళ్ల హర్‌దీప్‌ గుర్తింపు పొందాడు. గతంలో వినోద్‌ కుమార్‌ (45 కేజీలు; 1980లో).. పప్పూ యాదవ్‌ (51 కేజీలు; 1992లో)... సూరజ్‌ (55 కేజీలు; 2022లో) ఈ ఘనత సాధించారు.

ప్రస్తుతం ఆసియా అండర్‌–17 విభాగంలో చాంపియన్‌గా ఉన్న హర్‌దీప్‌... తొలి రౌండ్‌లో 2–0తో బక్తూర్‌ సొవెట్‌ఖాన్‌ (కజకిస్తాన్‌)పై, ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 4–2తో తొమెల్కా (పోలాండ్‌)పై, క్వార్టర్‌ ఫైనల్లో 9–0తో అనతోలి నవచెంకో (ఉక్రెయిన్‌)పై, సెమీఫైనల్లో 4–2తో ఎమ్రుల్లా కప్‌కాన్‌ (టర్కీ)పై విజయం సాధించాడు. హరియాణాలోని ఝాజర్‌ జిల్లాకు చెందిన హర్‌దీప్‌ తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ప్రస్తుతం హర్‌దీప్‌ బహదూర్‌గఢ్‌లోని ‘హింద్‌ కేసరి’ సోనూ అఖాడాలో ధర్మేందర్‌ దలాల్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు.  

మరో నాలుగు పతకాలు ఖాయం... 
ప్రపంచ అండర్‌–17 రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో నాలుగు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో భారత రెజ్లర్లు రచన (43 కేజీలు), మోనీ (57 కేజీలు), అశ్విని విష్ణోయ్‌ (65 కేజీలు), కాజల్‌ (73 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఈరోజు జరిగే ఫైనల్స్‌లో జిన్‌ హువాంగ్‌తో రచన... మద్‌ఖియా ఉస్మనోవా (కజకిస్తాన్‌)తో మోనీ, ముఖాయో రఖిమ్‌జొనోవా (ఉజ్బెకిస్తాన్‌)తో అశ్విని; వెన్‌జిన్‌ కియు (చైనా)తో కాజల్‌ తలపడతారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement