హంపి శుభారంభం | Sakshi
Sakshi News home page

హంపి శుభారంభం

Published Wed, May 29 2024 4:17 AM

Hampi gets off to a good start at Norway Chess Womens Open Tournament

స్టావెంజర్‌ (నార్వే): భారత చెస్‌ స్టార్, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి కోనేరు హంపి నార్వే చెస్‌ మహిళల ఓపెన్‌ టోర్నీలో శుభారంభం చేసింది. పియా క్రామ్లింగ్‌ (స్వీడన్‌)తో జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ హంపి అర్మగెడాన్‌ గేమ్‌లో గెలిచింది. ఈ టోర్నీ నిబంధనల ప్రకారం ముందుగా క్లాసికల్‌ ఫార్మాట్‌లో గేమ్‌ జరుగుతుంది. ఒకవేళ గేమ్‌ ‘డ్రా’ అయితే ఫలితం తేలడానికి అర్మగెడాన్‌ గేమ్‌ను నిర్వహిస్తారు. 

అర్మగెడాన్‌ గేమ్‌లో తెల్ల పావులతో ఆడే వారికి 10 నిమిషాలు, నల్ల పావులతో ఆడే వారికి 7 నిమిషాలు కేటాయిస్తారు. అర్మగెడాన్‌ గేమ్‌లో తెల్ల పావులతో ఆడే ప్లేయర్‌ నెగ్గని పక్షంలో... నల్ల పావులతో ఆడిన ప్లేయర్‌ గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంటే దానిని విజయంగా పరిగణిస్తారు. హంపి, పియా క్రామ్లింగ్‌ క్లాసికల్‌ గేమ్‌ 37 ఎత్తుల్లో ‘డ్రా’కాగా... ఫలితం తేలడానికి అర్మగెడాన్‌ గేమ్‌ నిర్వహించారు. 

ఇందులో నల్లపావులతో ఆడిన హంపి 51 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’ చేసుకోవడంతో ఆమెను విజేతగా ప్రకటించారు. భారత్‌కే చెందిన వైశాలి తొలి రౌండ్‌ క్లాసికల్‌ గేమ్‌లో 43 ఎత్తుల్లో వెన్‌జున్‌ జు (చైనా) చేతిలో ఓడిపోయింది. ఇదే టోర్నీ పురుషుల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద అర్మగెడాన్‌ గేమ్‌లో తెల్ల పావులతో ఆడుతూ 38 ఎత్తుల్లో  ఫిరూజా (ఫ్రాన్స్‌)పై గెలిచాడు. వీరిద్దరి మధ్య క్లాసికల్‌ గేమ్‌ 44 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement