
సెయింట్ లూయిస్ (అమెరికా): గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నమెంట్‌లో భారత స్టార్ దొమ్మరాజు గుకేశ్ చివరి మూడు రౌండ్‌లలో రాణించాడు. ర్యాపిడ్ విభాగం పోటీలు ముగిశాక 10 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. లీనియర్ డొమింగెజ్ (అమెరికా)తో జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో గుకేశ్ 45 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఈ ఓటమి నుంచి వెంటనే కోలుకున్న గుకేశ్ ఎనిమిదో రౌండ్ గేమ్‌లో 45 ఎత్తుల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ వెస్లీ సో (అమెరికా)పై గెలిచాడు.
అనంతరం ప్రపంచ 6వ ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన చివరిదైన తొమ్మిదో గేమ్‌లో గుకేశ్ 89 ఎత్తుల్లో సంచలన విజయం సాధించాడు. క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 6వ స్థానంలో ఉన్న గుకేశ్... ర్యాపిడ్ ఫార్మాట్‌లో 27వ ర్యాంక్‌లో, బ్లిట్జ్ ఫార్మాట్‌లో 93వ ర్యాంక్‌లో ఉన్నాడు. ర్యాపిడ్ విభాగం గేమ్‌లు ముగియడంతో... ఇక బ్లిట్జ్ ఫార్మాట్‌లో 18 గేమ్‌లు జరుగుతాయి.