
బుచ్చిబాబు టోర్నమెంట్-2025కు టీమిండియా స్పిన్నర్, తమిళనాడు స్టార్ ప్లేయర్ సాయి కిషోర్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ ఎడమ చేతి వాటం స్పిన్నర్ చేతి వేలి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అతడు కోలుకోవడానికి దాదాపు మూడు వారాల సమయం పట్టనున్నట్లు సమాచారం.
దీంతో ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ నుంచి సాయి కిషోర్ తప్పుకొన్నాడు. కాగా ఈ టోర్నీలో సాయికిషోర్ తమిళనాడు ప్రెసెడెంట్ ఎలెవన్ జట్టుకు సారథ్యం వహించాల్సి ఉండేది. ఇప్పుడు సాయి తప్పుకోవడంతో వికెట్ కీపర్ బ్యాటర్ ప్రదోష్ రంజన్ పాల్‌కు జట్టు పగ్గాలను సెలక్టర్లు అప్పగించారు.
వాస్తవానికి రంజన్ పాల్ తొలుత తమిళనాడు జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇప్పుడు తమిళనాడు ప్రెసెడెంట్ ఎలెవన్‌లోకి పాల్ రావడంతో షారుఖ్ ఖాన్ తమిళనాడు ఎలెవన్ జట్టును నడిపించనున్నాడు. కాగా బుచ్చి బాబు టోర్నీ చెన్నై వేదికగా ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 9 వరకు జరగనుంది.
సాయికిషోర్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2025 తర్వాత ఈ గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ ఇంగ్లండ్ కౌంటీల్లో సర్రే తరపున ఆడాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో 11 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. అయితే ఈ టోర్నీ మధ్యలోనే గాయపడడంతో అతడు కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు.
ఐపీఎల్‌లో కూడా సాయికిషోర్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. 15 మ్యాచ్‌లలో 19 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆగస్టు 28 నుంచి జరిగే దులీప్ ట్రోఫీలో కూడా సాయి కిషోర్ ఆడేది అనుమానమే. అతడు సౌత్‌జోన్ జట్టుకు ఎంపికయ్యాడు.
చదవండి: కాబోయే కోడలితో పూజలో సచిన్- అంజలి.. సారా ఫొటోలు వైరల్