
టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) కీలక టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నాడు. దేశీ రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ (Duleep Trophy)-2025 నుంచి అతడు విరమించుకున్నాడు. కాగా సౌత్ జోన్ కెప్టెన్‌గా ఎంపికైన ఈ హైదరాబాదీ.. జాతీయ జట్టు విధులతో బిజీ కానున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాడు.
కాగా దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో సౌత్ జోన్ నేరుగా సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. సెప్టెంబరు 4- 7 వరకు నార్త్ జోన్‌తో మ్యాచ్ ఆడనుంది. కాగా.. సౌత్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా తిలక్ వర్మ ఎంపికయ్యాడు. అయితే, ఆ తర్వాత ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీకి ప్రకటించిన భారత జట్టులోనూ తిలక్ స్థానం సంపాదించాడు.
ఆసియా కప్ కోసం..
ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఈ మెగా టోర్నీ సెప్టెంబరు 9- 28 వరకు జరుగనుంది. ఈ ఖండాంతర ఈవెంట్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో తిలక్ వర్మ.. సౌత్ జోన్ జట్టుకు దూరమయ్యాడు. కాగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటి టీమిండియాలోకి వచ్చిన తిలక్ వర్మ.. భారత టీ20 జట్టులో కీలక సభ్యుడిగా మారాడు.
సౌతాఫ్రికా పర్యటనలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ వరుస సెంచరీలతో దుమ్ములేపాడు. ఇక చివరగా స్వదేశంలో ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడిన తిలక్.. ఆ తర్వాత ఇంగ్లండ్ కౌంటీల్లో భాగమయ్యాడు. అనంతరం దులిప్ ట్రోఫీ టోర్నీకి అతడు అందుబాటులోకి వచ్చాడు.
కెప్టెన్‌గా అతడు.. జట్టులోకి గుంటూరు కుర్రాడు
అయితే, దులిప్ ట్రోఫీ తొలి సెమీస్.. ఆసియా కప్ టోర్నీ ఆరంభానికి మధ్య కాల వ్యవధి తక్కువగా ఉండటంతో ఈ దేశీ టోర్నీకి తిలక్ వర్మ దూరంకాక తప్పలేదు. అతడితో పాటు.. చెన్నైకి చెందిన సాయి కిశోర్ కూడా సౌత్ జోన్ జట్టుకు దూరమయ్యాడు.
ఈ క్రమంలో వీరిద్దరి స్థానంలో పుదుచ్చేరికి చెందిన అంకిత్ శర్మ, ఆంధ్ర క్రికెటర్, గుంటూరుకు చెందిన షేక్ రషీద్ సౌత్ జోన్ తరఫున దులిప్ ట్రోఫీలో సెమీస్ ఆడే సౌత్ జోన్ జట్టులోకి వచ్చారు. ఇక కెప్టెన్‌గా కేరళకు చెందిన వికెట్‌కీపర్ బ్యాటర్ మొహమ్మద్ అజారుద్దీన్ తిలక్ వర్మ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. అతడి డిప్యూటీగా తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ ఎన్. జగదీశన్ వ్యవహరించనున్నాడు.
దులిప్ ట్రోఫీ-2025: సౌత్ జోన్ జట్టు (అప్‌డేటెడ్)
మొహమ్మద్ అజారుద్దీన్ (కెప్టెన్, వికెట్ కీపర్), తన్మయ్ అగర్వాల్, షేక్ రషీద్, దేవ్‌దత్ పడిక్కల్, మోహిత్ కాలే, సల్మాన్ నిజార్, ఎన్.జగదీశన్ (వికెట్ కీపర్), టి. విజయ్, అంకిత్ శర్మ, తనయ్ త్యాగరాజన్, వైశాక్ విజయ్‌కుమార్, ఎండీ నిదీశ్, రిక్కీ భుయ్, బాసిల్ ఎన్‌పీ, గుర్జప్‌పీత్ సింగ్, స్నేహల్ కౌతంకర్.