రాజ్‌కోట్ వేదికగా భారత్-ఎ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక వన్డేలో సౌతాఫ్రికా-ఎ లోయార్డర్ బ్యాటర్లు సత్తాచాటారు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసన ప్రోటీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అయితే టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలకు భారత స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు. అతడి బౌలింగ్ ధాటికి తొలి ఓవర్‌లోనే దక్షిణాఫ్రికా రెండు వికెట్లను కోల్పోయింది. రెండో ఓవర్‌లో ప్రసిద్ద్ కృష్ణ సైతం కెప్టెన్ మార్క్వెస్ అకెర్‌మాన్‌ను పెవిలియన్‌కు పంపాడు.
ఆ తర్వాత అర్ష్‌దీప్, సింధు వరుస ఓవర్లలో మరో రెండు వికెట్లు సాధించారు. దీంతో ప్రోటీస్ జట్టు కేవలం 53 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో దిల్దానో పోట్‌గీటర్(88 పరుగులు; 103 బంతుల్లో), డెలనో పోట్‌గీటర్ (77 పరుగులు; 83 బంతుల్లో) విరోచిత పోరాటం కనబరిచారు.
వీరిద్దరూ ఆరో వికెట్‌కు వందకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అదేవిధంగా స్పిన్నర్ బ్యోర్న్ ఫార్టూన్ (59 పరుగులు; 56 బంతుల్లో) బ్యాట్‌తో సత్తాచాటాడు. దీంతో భారత్‌కు ఫైటింగ్ టార్గెట్‌ను సౌతాఫ్రికా ఉంచింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ధ్ కృష్ణ, నిశాంత్ సింధు, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి తలో ఒక వికెట్ పడగొట్టారు.
286 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది. 20 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(31), రియాన్ పరాగ్(8) వికెట్లను మెన్ ఇన్ బ్లూ కోల్పోయింది.
చదవండి: ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ.. భారత తుది జట్టు ఇదే


