
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సృష్టికర్త లలిత్ మోదీపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్వార్థ ప్రయోజనాల కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతారంటూ ఫైర్ అయ్యాడు. మనుషులు అన్నాక తప్పులు చేయడం సహజమని.. అయితే, అందుకు పశ్చాత్తాపపడిన తర్వాత కూడా పదే పదే అదే ఘటన గుర్తుచేయడం సరికాదన్నాడు.
శ్రీశాంత్ చెంపపై కొట్టాడు
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఐపీఎల్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది ‘స్లాప్‌గేట్’. అరంగేట్ర సీజన్‌లో అంటే.. 2008లో ముంబై ఇండియన్స్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh)- కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) పేసర్ శ్రీశాంత్ (Sreesanth) మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటున్న సమయంలో భజ్జీ.. శ్రీశాంత్ చెంపపై కొట్టాడు.
క్షమాపణలు చెప్పిన భజ్జీ
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్ యాజమాన్యం.. భజ్జీ ఆ ఎడిషన్‌లో తదుపరి మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. అయితే, ఈ ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన హర్భజన్ ఇప్పటికే శ్రీశాంత్‌కు వివిధ వేదికలపై క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలూ లేవు.
కానీ లలిత్ మోదీ.. నాటి ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా విడుదల చేసి పాత గాయాన్ని మళ్లీ రేపాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఇంటర్వ్యూ ఇస్తున్న క్రమంలో భజ్జీ.. శ్రీశాంత్‌పై చెంప దెబ్బ కొట్టిన వీడియోను లలిత్ మోదీ రిలీజ్ చేశాడు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ భార్య భువనేశ్వరి కుమారి.. ‘‘మీకసలు మానవత్వం ఉందా?’’ అంటూ తీవ్ర స్థాయిలో లలిత్ మోదీ, క్లార్క్‌లపై ఫైర్ అయ్యారు.
నీ అంత స్వార్థపరుడు మరొకడు ఉండడు
తాజాగా హర్భజన్ సింగ్ కూడా లలిత్ మోదీ చర్యపై స్పందించాడు. ‘‘వీడియోను లీక్ చేసిన విధానం తప్పు. అసలు ఇలా జరిగి ఉండాల్సింది కాదు. దీని వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
పద్దెనిమిదేళ్ల క్రితం జరిగిన ఘటన. దాని గురించి అందరూ ఎప్పుడో మర్చిపోయారు. కానీ వీళ్లు మరోసారి ప్రజలకు దీనిని కావాలనే గుర్తుచేస్తున్నారు’’ అని భజ్జీ ఫైర్ అయ్యాడు. ‘నీ అంత స్వార్థపరుడు మరొకడు ఉండడు’ అన్నట్లుగా లలిత్ మోదీ తీరును తప్పుబట్టాడు.
ఇప్పటికే ఎన్నోసార్లు ఒప్పుకొన్నా
అదే విధంగా.. ‘‘నాడు జరిగిన ఘటన నన్నెంతో వేదనకు గురిచేసింది. మ్యాచ్ ఆడే క్రమంలో ఆటగాళ్లు భావోద్వేగాలకు లోనవుతారు. తప్పులు జరగడం సహజం. అందుకు సిగ్గుపడాలి. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది.
అదో దురదృష్టకర ఘటన. నేను ఆరోజు తప్పుచేశానని ఇప్పటికే ఎన్నోసార్లు ఒప్పుకొన్నాను. ఇంకోసారి తప్పు చేయనని.. ఒకవేళ తప్పు చేస్తే దానిని సరిదిద్దుకునేలా చేయమని ఆ గణేశుడిని ప్రార్థిస్తున్నా’’ అని హర్భజన్ సింగ్ ఉద్వేగానికి లోనయ్యాడు.
చదవండి: తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత యువ స్పిన్నర్