తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత యువ స్పిన్నర్‌ | Jharkhand Spinner Manishi Equals World Record with 6 LBWs in Duleep Trophy Debut | Sakshi
Sakshi News home page

తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత యువ స్పిన్నర్‌

Sep 1 2025 1:30 PM | Updated on Sep 1 2025 2:53 PM

World Record For 21 Year Old Spin Prodigy After 6 LBWs In Duleep Trophy Clash

జార్ఘండ్‌కు చెందిన 21 ఏళ్ల మానిషి తన తొలి దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు సమం చేశాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ స్పిన్నర్‌ అయిన అతడు.. తాజాగా జరిగిన మ్యాచ్‌లో (దులీప్‌ ట్రోఫీ మొదటి క్వార్టర్‌ ఫైనల్‌) ఈస్ట్‌ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ.. నార్త్‌ జోన్‌పై 6 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో) తీశాడు.

మానిషి తీసిన ఈ 6 వికెట్లు ఎల్బీడబ్ల్యూ రూపంలో రావడం విశేషం. ఈ కారణంగానే అతని పేరిట ప్రపంచ రికార్డు నమోదైంది. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో మానిషికి ముందు కేవలం ఐదుగురు మాత్రమే ఓ ఇన్నింగ్స్‌లో ఆరుగురిని ఎల్బీడబ్ల్యూ చేశారు. వీరిలో భారతీయులు ఒక్కరు కూడా లేరు.

దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా మానిషి చరిత్ర సృష్టించాడు. అలాగే మార్క్‌ ఇలాట్‌ (1995), చమింద వాస్‌ (2005), తబిష్‌ ఖాన్‌ (2012), ఓలీ రాబిన్సన్‌ (2021), క్రిస్‌ రైట్‌తో (2021) కలిసి ప్రపంచ రికార్డును పంచుకున్నాడు. ఇలాట్‌, వాస్‌, తబిష్‌ ఖాన్‌, రాబిన్సన్‌, క్రిస్‌ రైట్‌ కూడా మానిషిలాగే ఒకే ఇన్నింగ్స్‌లో ఆరుగురిని ఎల్బీడబ్ల్యూ చేశారు.

మానిషి ఈ మ్యాచ్‌లో శుభమ్‌ ఖజురియా, అంకిత్‌ కుమార్‌, యశ్‌ ధుల్‌, కన్హయ్య వధవాన్‌, ఆకిబ్‌ నబీ, హర్షిత్‌ రాణాను ఎల్బీడబ్ల్యూ చేశాడు. మానిషి తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో (22.2-2-111-6) చెలరేగినా రెండో ఇన్నింగ్స్‌లో (34-3-166-0) తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో నార్త్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ ఆధారంగా సెమీస్‌కు అర్హత సాధించింది.

జంషెడ్‌పూర్‌లో జన్మించిన మానిషికి ఇది తొలి దులీప్‌ ట్రోఫీ మ్యాచే అయినప్పటికీ.. ఇదివరకే 9 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు. 2023-24 రంజీ సీజన్‌లో అతను అత్యుత్తమంగా (22 వికెట్లు) రాణించాడు. మానిషి 2019లో భారత అండర్‌-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఓ మ్యాచ్‌లో అతను ఐదు వికెట్ల ప్రదర్శన సహా 7 వికెట్లు తీశాడు. తాజా ప్రదర్శన తర్వాత మానిషిపై ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు దృష్టి సారించవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement