గత దశాబ్ద కాలంగా భారత క్రికెట్ జట్టు- హెడ్‌కోచ్‌ల మధ్య అనుబంధం బాగా బలపడింది. రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)లతో మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సత్సంబంధాలు కొనసాగించారు. ఇక ద్రవిడ్ మార్గదర్శనంలో.. రోహిత్ సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ద్రవిడ్ హెడ్‌కోచ్ పదవి నుంచి వైదొలగగా.. మరో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ (Gautam Gambhir) భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. తన వ్యూహాలకు అనుగుణంగా యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు వచ్చేలా చేస్తున్న గౌతీ.. ఇటీవలే శుబ్‌మన్ గిల్ టెస్టు, వన్డే పగ్గాలు చేపట్టడంలో కీలక పాత్ర పోషించాడు.
ప్రస్తుతానికి కోచ్‌కు- ఆటగాళ్లకు మధ్య చిన్న చిన్న విభేదాలు తప్ప పెద్ద గొడవలేమీ లేనట్లే కనిపిస్తోంది. జట్టుపై పూర్తిగా పట్టు సాధించిన గౌతీ.. అవసరమైన వేళ ఆటగాళ్లకు మద్దతుగా ఉంటూ టీమ్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.
పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వివాదం
మరి గతంలో ఓ హెడ్‌కోచ్‌కు- ఆటగాళ్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వివాదం రాజుకుందని తెలుసా?.. మీరు ఊహించినట్లుగా ఇది గ్రెగ్ చాపెల్- సౌరవ్ గంగూలీ ఎపిసోడ్ గురించి కాదు. భారత వరల్డ్‌కప్ విన్నింగ్ హీరోకు- దిగ్గజ ఆటగాళ్లకు మధ్య జరిగిన గొడవ.. ఇంతకీ ఏంటీ విషయం?!
కపిల్ దేవ్ కెప్టెన్సీలో వన్డే వరల్డ్‌కప్-1983 నెగ్గిన జట్టులో సభ్యుడైన మదన్ లాల్.. 1996- 97 మధ్య కాలంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉండగా.. మదన్ లాల్ (Madan Lal) నాడు టీమ్‌లో ఉన్న కొందరు ఆటగాళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
విఫలం అవుతావని చెప్పా
ది హిందూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మదన్ లాల్ మాట్లాడుతూ.. టీమిండియా ఓటములకు సదరు ఆటగాళ్లే కారణం అనేలా విమర్శలు చేశాడు. అజయ్ జడేజా గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నువ్వు బౌలర్‌గా లేదంటే బ్యాటర్‌గా ఆడబోతున్నావా? అనేది ముందుగానే నిర్ణయించుకో అని అతడికి చెప్పాను. ఒక్క మ్యాచ్‌లో సరిగ్గా ఆడకపోతే తర్వాత ఐదు మ్యాచ్‌లలోనూ విఫలం అవుతావని చెప్పా’’ అని మదన్ లాల్ పేర్కొన్నాడు.
ఆల్‌రౌండర్‌గా రాణించలేడు
మరోవైపు రాబిన్ సింగ్‌ను ఉద్దేశించి.. ‘‘చాలానే కష్టపడతాడు కానీ.. అంతర్జాతీయ స్థాయిలో ఆల్‌రౌండర్‌గా రాణించలేడు’’ అని మదన్ లాల్ అన్నాడు. ఇక సబా కరీం గురించి మాట్లాడుతూ.. ‘‘అతడొక సగటు వికెట్ కీపర్ బ్యాటర్ మాత్రమే’’ అని ట్యాగ్ ఇచ్చాడు.
కుంబ్లే ‘టర్న్’ కాదు.. దానిమీద దృష్టి పెట్టు
అంతేగాకుండా అప్పట్లో టీమిండియా ప్రధాన స్పిన్ అస్త్రమైన అనిల్ కుంబ్లే గురించి చెబుతూ.. ‘‘అతడి బౌలింగ్‌తో సంతోషంగా లేనని చెప్పా. నువ్వు బంతిని తిప్పడం కంటే లైన్ అండ్ లెంగ్త్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టమని చెప్పా’’ అని మదన్ లాల్ పేర్కొన్నాడు. ఓవరాల్‌గా.. ‘‘మేము గెలవలేకపోతున్నాం. కానీ నేనొక్కడినే ఏం చేయగలను?’’ అంటూ ఆటగాళ్లను టార్గెట్ చేశాడు.
ఈ ఇంటర్వ్యూ తర్వాత భారత క్రికెట్ శిబిరంలో కల్లోలం చెలరేగింది. అప్పటి మేనేజర్ రత్నాకర్ శెట్టి వెంటనే జర్నలిస్టు విజయ్‌ను సంప్రదించి.. మదన్ లాల్ నిజంగానే ఈ వ్యాఖ్యలు చేశారని నిర్దారించుకున్నాడు.
మాటల్లేవ్.. బాయ్‌కాట్ చేసేశారు
ఈ నేపథ్యంలో.. మదన్ లాల్ వ్యాఖ్యలతో తీవ్రంగా నొచ్చుకున్న ఆటగాళ్లు అతడితో చాలా రోజుల పాటు మాట్లాడనే లేదు. నాటి సిరీస్‌లో ఓ వన్డేలో అజయ్ జడేజా సెంచరీ చేసిన తర్వాత ఈ విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ మ్యాచ్‌లో మొహమ్మద్ అజారుద్దీన్ కూడా సెంచరీ చేశాడు.
వేటు వేసిన బీసీసీఐ
ఆ తర్వాత ఈ హెడ్‌కోచ్ వద్దని ఆటగాళ్లు పట్టుబట్టడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మదన్ లాల్‌పై వేటు వేసి అన్షుమాన్ గైక్వాడ్‌తో అతడి స్థానాన్ని భర్తీ చేసింది. అలా టీమిండియా హెడ్‌కోచ్‌గా మదన్ లాల్ పది నెలల పదవీ కాలం వివాదంతో ముగిసిపోయింది. అప్పటి బీసీసీఐ మేనేజర్ రత్నాకర్ శెట్టి తన ఆటోబయోగ్రఫీ.. ‘ఆన్ బోర్డ్- మై ఇయర్స్ ఇన్ బీసీసీఐ’లో ఈ విషయాలను ప్రస్తావించాడు.
చదవండి: కాంట్రాక్టర్ నుంచి శ్రేయస్ దాకా.. మైదానంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్లు వీరే..!


