
భారత టెస్టు కెప్టెన్సీపై గిల్ స్పందన
విదేశాల్లో ఎలా గెలవాలో తెలుసు
సీనియర్ల నుంచి నేర్చుకున్నానన్న కొత్త సారథి
ముంబై: భారత టెస్టు క్రికెట్ చరిత్రలో విదేశీ గడ్డపై అప్పుడప్పుడు కొన్ని మెరుపులు మినహా మన జట్టు రికార్డు పేలవంగానే ఉంది. సహజంగానే సిరీస్‌లో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలతో పాటు కెప్టెన్సీపై కూడా అందరి దృష్టీ ఉంటుంది. ఇప్పుడు టీమిండియా టెస్టు కెప్టెన్ హోదాలో శుబ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తొలిసారి బరిలోకి దిగబోతున్నాడు. ఈ నేపథ్యంలో సారథిగా తనపై అనవసరపు ఒత్తిడిని పెంచుకోనని గిల్ స్పష్టం చేశాడు. కెపె్టన్‌గా ఎంపికైన తర్వాత అతను బీసీసీఐ మీడియాతో తన స్పందనను పంచుకున్నాడు.
బ్యాటర్‌గా కూడా తన బాధ్యత నెరవేర్చడం ముఖ్యమని అతను అన్నాడు. ‘ఒక విషయంలో నేను చాలా స్పష్టంగా ఉండదల్చుకున్నాను. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నేను బ్యాటర్‌గానే ఆలోచిస్తాను. అదే కోణంలో నిర్ణయాలు తీసుకుంటాను తప్ప కెప్టెన్ హోదా గురించి పట్టించుకోను. బ్యాటింగ్ చేస్తూ కూడా ఇతర అంశాలపై దృష్టి పెడితే సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. అది అవసరం లేదు. నేను కెప్టెన్‌ను అనే భావనే రాకుండా నా బ్యాటింగ్‌తో ఏం చేయగలననేది ముఖ్యం’ అని గిల్ వ్యాఖ్యానించాడు.
భారత కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల చాలా సంతోషంగా ఉందన్న గిల్... అదో పెద్ద బాధ్యత అని అభిప్రాయపడ్డాడు. ‘చిన్నప్పుడు క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు భారత్‌కు ఆడితే చాలనుకుంటాం. ఆ తర్వాత ఎక్కువ కాలం టెస్టులు ఆడితే బాగుంటుందని భావిస్తాం. అలాంటిది ఇప్పుడు కెప్టెన్ కావడం గొప్ప గౌరవం. ఇంత పెద్ద బాధ్యత నాకు దక్కిన గొప్ప అవకాశం. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని గిల్ భావోద్వేగం ప్రదర్శించాడు.
ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడంతో పాటు ఏ సమయంలో కెప్టెన్ అవసరం జట్టుకు ఉంటుందని గుర్తించడం కూడా కీలకమని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇటీవలే టెస్టుల నుంచి రిటైర్ అయిన కోహ్లి, రోహిత్, అశ్విన్‌ల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని... విదేశాల్లో ఎలా గెలవాలో వారు చూపించారని కొత్త కెప్టెన్ అన్నాడు. ‘రోహిత్, విరాట్, అశ్విన్ విదేశాల్లో టెస్టులు, సిరీస్‌లు ఎలా గెలవాలనే విషయంలో ఒక ‘బ్రూప్రింట్’ను అందించారు. దీనిని అమలు చేయగలగాలి.
విరాట్, రోహిత్‌ల నాయకత్వంలో ఆడటం నా అదృష్టం. బయటకు కనిపించడంలో ఇద్దరి శైలి భిన్నమే అయినా...మైదానంలో అటాకింగ్ చేసే విషయంలో ఇద్దరూ దూకుడుగానే ఉంటారు. ఎప్పటికిప్పుడు మాట్లాడుతూ ఆటగాళ్లనుంచి తనకు ఏం కావాలో స్పష్టంగా చెప్పే రోహిత్ కెప్టెన్సీ పద్ధతిని నేను నేర్చుకున్నాను’ అని గిల్ వివరించాడు.