‘వైభవ్‌ కోసం ఎదురు చూస్తున్నారు’ | Former India Ireland cricketer MV Narasimha Rao on Vaibhav Suryavanshi | Sakshi
Sakshi News home page

‘వైభవ్‌ కోసం ఎదురు చూస్తున్నారు’

Jun 25 2026 4:08 AM | Updated on Jun 25 2026 4:08 AM

Former India Ireland cricketer MV Narasimha Rao on Vaibhav Suryavanshi

మైదానంలో సీట్ల సంఖ్య పెంచాల్సి ఉంది 

భారత్‌–ఐర్లాండ్‌ మాజీ క్రికెటర్‌ ఎంవీ నరసింహారావు   

బెల్‌ఫాస్టట్: భారత్, ఇంగ్లండ్‌ మధ్య రేపు తొలి టి20 మ్యాచ్‌ సివిల్‌ సర్వీస్‌ క్రికెట్‌ క్లబ్‌ గ్రౌండ్‌ (స్టోర్‌మోంట్‌)లో జరగనుంది. ఈ మైదానం సామర్థ్యం దాదాపు 7 వేలు మాత్రమే! అయితే సరికొత్త సంచలనం వైభవ్‌ సూర్యవంశీ ఆటను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో తాత్కాలిక ఏర్పాట్లతోనైనా సీట్ల సంఖ్యను పెంచాలని ఐర్లాండ్‌ క్రికెట్‌ బోర్డు భావిస్తోంది. వైభవ్‌ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తే అది కొత్త చరిత్ర అవుతుందని భారత్‌–ఐర్లాండ్‌ మాజీ క్రికెటర్‌ ఎంవీ నరసింహారావు (బాబ్జీ) అభిప్రాయ పడ్డారు. 

ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో వైభవ్‌ గురించే చర్చ సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ‘బెల్‌ఫాస్ట్‌లో వైభవ్‌ మేనియా మొదలైంది. అతను తొలి మ్యాచ్‌ బరిలోకి దిగితే కొత్త రికార్డు సృష్టిస్తాడు. ఇంతటి ఆసక్తిని మేం ఊహించలేదు. గత కొద్ది రోజులుగా మ్యాచ్‌ గురించి చాలా మంది ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. యూరోప్‌లోని పారిస్‌ తదితర ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చాలా మంది మ్యాచ్‌ను చూడాలని భావిస్తున్నారు. వారికి తగిన ఏర్పాట్లు చేయడం నిర్వాహకుల బాధ్యత. 

అయితే మ్యాచ్‌ జరిగే స్టేడియం సామర్థ్యం 7 వేలు మాత్రమే. చాలా మంది టికెట్ల కోసం ఎగబడుతున్నారు. కాబట్టి ఏదో రకంగా అదనపు సీట్లు ఏర్పాటు చేయాల్సిందే’ అని నరసింహారావు అన్నారు. వైభవ్‌ ఆటపై ప్రశంసలు కురిపించిన ఆయన... ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే లక్షణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ‘వైభవ్‌ అద్భుతమైన బ్యాటర్‌. ఐపీఎల్‌లో అతను ప్రదర్శనను చూశాను. కాస్త నెమ్మదిగా ఉండే ఐర్లాండ్‌ పిచ్‌లపై కూడా అతను ప్రభావం చూపించగలడు. 

అయితే బంతి బాగా స్వింగ్‌ అయ్యే ఇంగ్లండ్‌లో అతనికి అసలు సవాల్‌ ఎదురవుతుంది. అతని కొన్ని షాట్లు చూస్తే గ్యారీ సోబర్స్‌ను కూడా గుర్తుకు తెస్తున్నాడు. ఇంత చిన్న వయసులో అన్ని రకాల షాట్లు ఆడగలుగుతున్నాడు. ఆ ప్రతిభ దేవుడు ఇచ్చిన బహుమతి. సచిన్‌ టెండూల్కర్‌ తరహాలోనే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే లక్షణాలతో పాటు తీవ్ర సాధన, ఫిట్‌నెస్, క్రమశిక్షణను కొనసాగించాలనేది నా సలహా’ అని నరసింహారావు సూచించారు.  

మైదానంలో గంట మోగించనున్న ‘బాబ్జీ’... 
సన్నిహితుల ద్వారా ‘బాబ్జీ’గా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ క్రికెటర్‌ ఎంవీ నరసింహారావు 1978–79లో భారత్‌ తరఫున 4 టెస్టులు ఆడారు. అయితే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఆయనకు మంచి రికార్డు ఉంది. 108 మ్యాచ్‌లలో 9 సెంచరీలు సహా 4845 పరుగులు చేసిన బాబ్జీ...లెగ్‌స్పిన్నర్‌గా 245 వికెట్లు కూడా పడగొట్టారు. సరిగ్గా 40 ఏళ్ల క్రితం 1986–87 సీజన్‌లో హైదరాబాద్‌ జట్టు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. 

బాబ్జీ కెప్టెన్సీలోనే జట్టు ఈ ఘనత సాధించారు. ఆ తర్వాత హైదరాబాద్‌ మళ్లీ రంజీ టైటిల్‌ గెలవలేకపోయింది. హైదరాబాద్‌లో తొలి క్రికెట్‌ కోచింగ్‌ అకాడమీ (సెయింట్‌ జాన్స్‌) పెట్టి వీవీఎస్‌ లక్ష్మణ్, మిథాలీ రాజ్‌లాంటి స్టార్‌ క్రికెటర్లకు ఆయన శిక్షణ ఇచ్చారు. అనంతరం ఐర్లాండ్‌కు వెళ్లి అక్కడే స్థిరపడిన నరసింహారావు ఆ దేశం తరఫున కూడా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడారు. అక్కడే కోచ్‌గా పలువురు ఐర్లాండ్‌ క్రికెటర్లు ఇయాన్‌ మోర్గాన్, కెవిన్‌ ఓబ్రైన్, పోర్టర్‌ఫీల్డ్, బల్బర్నీలను తీర్చిదిద్దడంలో బాబ్జీ కీలక పాత్ర పోషించారు. 

ఈ సేవలకుగాను ఐర్లాండ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎంబీఈ పురస్కారంతో సత్కరించింది. ఈ నెల 28న భారత్, ఐర్లాండ్‌ జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్‌కు ముందు మైదానంలో ఏర్పాటు చేసిన గంట (రాయ్‌ టారెన్స్‌ బెల్‌)ను బాబ్జీ మోగించనున్నారు. ఇరు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా ఆయనకు ఈ గౌరవం దక్కింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement