
టీ20 క్రికెట్‌లో ఫిన్‌లాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహేష్ తంబే సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అత్యంతవేగంగా ఫైవ్ వికెట్ల హాల్‌ను సాధించిన బౌలర్‌గా వరల్డ్ రికార్డు సాధించాడు. మంగళవారం ఎస్టోనియన్ జాతీయ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఎస్టోనియాతో జరిగిన మూడో టీ20 తంబే ఈ ఫీట్ నమోదు చేశాడు.
ఈ మ్యాచ్‌లో మహేష్ కేవలం 8 బంతుల్లోనే 5 వికెట్ల ఘనత సాధించాడు. ఎస్టోనియా బ్యాటర్లు స్టెఫాన్ గూచ్, సాహిల్ చౌహాన్, ముహమ్మద్ ఉస్మాన్, రూపమ్ బారువా, ప్రణయ్ ఘీవాలా వికెట్లను పడగొట్టి తంబే ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు బహ్రెయిన్ ఆటగాడు జునైద్ అజీజ్ పేరిట ఉండేది.
అజీజ్ 2022లో జర్మనీపై 10 బంతుల్లో ఫైవ్ వికెట్ హాల్ నమోదు చేశాడు. తాజా మ్యాచ్‌తో అజీజ్ అల్‌టైమ్ రికార్డును తంబే బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఎస్టోనియాపై 5 వికెట్ల తేడాతో ఫిన్లాండ్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో ఫిన్లాండ్ సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్టోనియా 19.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు స్టెఫాన్ గూచ్(22),హబీబ్ ఖాన్(23) తొలి వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ ఆఖరిలో వరుసక్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఎస్టోనియా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. అనంతరం 142 పరుగుల లక్ష్యాన్ని ఫిన్లాండ్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో చేధించింది. ఫిన్లాండ్ ఓపెనర్ అర్వింద్ మోహన్(67) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.