PC: Pak cricket
పాకిస్తాన్ అండర్-19 జట్టు మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ హసన్ ఖాన్ అమెరికా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్-2 లో భాగంగా యూఏఈ, నమీబియాలతో జరుగుతున్న ట్రై-సిరీస్ కోసం అమెరికా జట్టులో అతడికి చోటు దక్కింది. గాయం కారణంగా ఈ ముక్కోణపు సిరీస్‌కు దూరమైన పేస్ బౌలర్ అలీ ఖాన్ స్థానంలో హసన్ ఖాన్‌ను జట్టులోకి తీసుకున్నారు. అక్టోబర్ 7న నమీబియాతో జరిగే మ్యాచ్‌లో అతడు అమెరికా తరపున డెబ్యూ చేసే ఛాన్స్ ఉంది.
ఒకప్పుడు పాక్ కెప్టెన్‌గా
కాగా 27 ఏళ్ల హసన్ ఖాన్ 2018 అండర్-19 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రస్తుత పాక్ పేసర్లు షాహీన్ షా అఫ్రిది, ముసా వంటి వారు జానియర్ ప్రపంచకప్‌లో హసన్ ఖాన్ సారథ్యంలోనే ఆడాడు. ఆ తర్వాత షాహీన్ సీనియర్ పాక్ జట్టులోకి దూసుకెళ్లగా.. హసన్ ఖాన్ మాత్రం జాతీయ జట్టు తరపున డెబ్యూ చేసే అవకాశం రాలేదు.
దీంతో అతడు తన మకాంను యూఎస్‌కు మార్చాడు. అమెరికాలో ఉంటూనే బిగ్‌బాష్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్ వంటి ఫ్రాంచైజీ టోర్నీల్లో అతడు ఆడుతూ వస్తున్నాడు. పీఎస్ఎల్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్, లాహోర్ ఖలందర్స్ జట్లకు అతడు వహించాడు. అలాగే అమెరికా స్ధానిక టీ20 లీగ్‌లో శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ తరఫున గత కొన్ని సీజన్లగా అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నాడు.
ఈ క్రమంలోనే అతడు యూఎస్‌ఎ సెలక్టర్లు దృష్టిలో పడి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. హసన్‌కు అద్భుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. లెఫ్ట్ ఆర్మ్‌స్పిన్ బౌలింగ్‌తో పాటు లోయార్డర్‌లో బ్యాట్‌తో మెరుపులు మెరిపించగలడు. ఇప్పటివరకు అతడు 51 లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో 735 పరుగులతో పాటు 44 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: విండీస్ కెప్టెన్


