
సొంత గడ్డపై టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు అదిరిపోయే ప్రాక్టీస్ లభించింది. నాటింగ్‌హామ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు దంచి కొట్టారు. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించింది. 498/3 ఓవర్ నైట్‌స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. తమ మొదటి ఇన్నింగ్స్‌ను 565/6 వద్ద డిక్లేర్ చేసింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్ క్రాలీ (171 బంతుల్లో 124; 14 ఫోర్లు), బెన్ డకెట్ (134 బంతుల్లో 140; 20 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఒలీ పోప్ (163 బంతుల్లో 171, 24 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ శతకాలతో కదం తొక్కగా... హ్యారీ బ్రూక్(58), రూట్(34) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో ముజారబానీ మూడు వికెట్లు పడగొట్టగా.. చవింగా, మాధవీరే, రజా తలా వికెట్ సాధించారు
.కాగా ఇంగ్లండ్ జట్టు తొలి రోజే రికార్డు స్థాయిలో 88 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసింది. టెస్టు క్రికెట్‌లో తొలి రోజు నమోదైన రెండో అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం. అంతకుముందు 2022లో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్ తొలి రోజు 506/4 పరుగులు చేసింది. మరో 9 పరుగులు చేసుంటే ఇంగ్లీష్ జట్టు తమ రికార్డును తామే బ్రేక్ చేసేది.
తుది జట్లు
ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, ఓల్లీ పోప్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), గస్ అట్కిన్సన్, సామ్యూల్ జేమ్స్ కుక్, జోష్ టంగ్, షోయబ్ బషీర్
జింబాబ్వే: బెన్ కర్రాన్, బ్రియాన్ బెన్నెట్, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), సీన్ విలియమ్స్, సికందర్ రజా, వెస్లీ మాధేవెరే, తఫాద్జ్వా త్సిగా (వికెట్ కీపర్), రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ, తనకా చివంగ, విక్టర్ న్యౌచి