
సౌతాఫ్రికాతో ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయిన ఇంగ్లండ్ ఆఖరి మ్యాచ్‌కు సిద్దమైంది. ఆదివారం సౌతాంప్టన్ వేదికగా జరగనున్న మూడో వన్డేలో ఎలాగైనా గెలిచి వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
ఈ క్రమంలో మూడో వన్డేకు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఇంగ్లండ్ క్రికెట్ శనివారం ప్రకటించింది. ఇంగ్లండ్ తమ తుది జట్టులో కేవలం ఒకే ఒక మార్పు చేసింది. పేసర్ సాకిబ్ మహమూద్ స్దానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ జామీ ఓవర్టన్ జట్టులోకి వచ్చాడు.
ఓవర్టన్ ఇటీవలే రెడ్‌బాల్ క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో విఫలమైన బెన్ డకెట్‌ను మూడో వన్డేకు కొనసాగించారు. అయితే డకెట్‌కు ప్రోటీస్‌తో టీ20ల నుంచి మాత్రం సెలక్టర్లు తప్పించారు. గత కొంతకాలంగా అవిరామంగా క్రికెట్ ఆడుతుండడంతో అతడికి విశ్రాంతి ఇచ్చారు.
కాగా తొలి వన్డేలో సఫారీల చేతిలో 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసిన ఇంగ్లండ్.. అనంతరం రెండో వన్డేలో పోరాడి ఓడింది. దీంతో సిరీస్‌ను కోల్పోయింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఇంగ్లండ్ వన్డే ప్రపంచకప్-2027కు నేరుగా ఆర్హత సాధించే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌కు తదుపరి వన్డే మ్యాచ్‌లు చాలా కీలకంగా మారనున్నాయి.
మూడో వన్డేకు ఇంగ్లండ్ తుది జట్టు
జేమీ స్మిత్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్