
ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల మధ్య మూడు టీ20ల సిరీస్ 1–1తో సమంగా ముగిసింది. నాటింగ్‌హామ్ వేదిగా ఆదివారం జరగాల్సిన నిర్ణాయక ఆఖరి పోరు వర్షంతో రద్దయ్యింది. తెరిపినివ్వని వాన వల్ల మ్యాచ్‌కు అవకాశమే లేకపోయింది.
కనీసం టాస్ కూడా వేయలేదు. మైదానమంతా చిత్తడిగా మారడంతో చేసేదేమీ లేక ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సిరీస్‌లో భాగంగా కార్డిఫ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో పర్యాటక దక్షిణాఫ్రికా గెలిచింది.
ఈ మ్యాచ్‌కూ వరుణుడు అంతరాయం కలిగించగా సఫారీ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 14 పరుగులతో గెలిచింది. మాంచెస్టర్‌లో జరిగిన రెండో టి20లో ఇంగ్లండ్ ఏకంగా 146 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది.
ఈ రెండో టీ20లో ఇంగ్లండ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. మొదట బ్యాటింగ్ చేసిప ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 60 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సాల్ట్ 15 ఫోర్లు, 8 సిక్సర్లతో 141 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
అతడితో పాటు జోస్ బట్లర్ 30 బంతుల్లో ఏకంగా 83 పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం లక్ష్య చేధనలో సౌతాఫ్రికా 16.1 ఓవర్లలోనే 158 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో సఫారీలు సొంతం చేసుకున్నారు.
చదవండి: చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్.. పాక్ ఆటగాడి రికార్డు బ్రేక్