
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో ఇంగ్లండ్ జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా దారుణ ప్రదర్శన కనబరిచింది.
ఇంగ్లీష్ జట్టు బౌలర్ల దాటికి సౌతాఫ్రికా అమ్మాయిలు విలవిల్లాడారు. దక్షిణాఫ్రికా 20.4 ఓవర్లలో కేవలం 69 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్ బ్యాటర్లలో మొత్తం పది మంది సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. సినాలో జాఫ్తా(22) టాప్ స్కోరర్‌గా నిలిచింది.
ఇంగ్లండ్ బౌలర్లలో లిన్సే స్మిత్ మూడు వికెట్లతో సౌతాఫ్రికాను దెబ్బతీయగా.. స్కివర్ బ్రంట్, ఎకిలిస్టోన్, డీన్ తలా రెండు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం 70 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 14.1 ఓవర్లలో చేధించింది.
ఓపెనర్లు టామీ బ్యూమాంట్(21), అమీ జోన్స్(40) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. మూడు వికెట్లతో సత్తాచాటిన స్మిత్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచింది. వన్డేల్లో దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం ఇదే తొలిసారి.
చదవండి: ఆసియాకప్ ట్రోఫీని భారత్‌కు ఇవ్వొద్దు.. ఆ మొండితనం ఏంటి?: పాక్ మాజీ క్రికెటర్