
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. ఫుల్ మెంబర్ జట్టుపై అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో టీమిండియా పేరిట ఉన్న రికార్డును హ్యారీ బ్రూక్ బృందం బద్దలు కొట్టింది.
అంతేకాదు.. అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌లో అత్యధిక బౌండరీలు నమోదు చేసిన జట్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. స్వదేశంలో సౌతాఫ్రికా (ENG vs SA)తో రెండో టీ20 సందర్భంగా ఇంగ్లండ్ ఈ ఘనత సాధించింది.
ఇంగ్లండ్ విశ్వరూపం
కాగా సొంతగడ్డపై ప్రొటిస్ జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్.. తొలి టీ20లో పద్నాలుగు పరుగుల స్వల్ప తేడాతో ఓడింది. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం ఇంగ్లండ్ విశ్వరూపం ప్రదర్శించింది. ఇటు బ్యాటర్లు.. అటు బౌలర్లు రాణించడంతో సౌతాఫ్రికాను ఏకంగా 146 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.

ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్.. ఊహకందని రీతిలో..
మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (Phil Salt), జోస్ బట్లర్ (Jos Buttler) ఆకాశమే హద్దుగా చెలరేగారు. సాల్ట్ 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న సాల్ట్ పదిహేను ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 141 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు.. బట్లర్ 30 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 83 పరుగులతో దుమ్ములేపాడు.
304 పరుగులు
ఇక వన్‌డౌన్‌లో వచ్చిన జేకబ్ బెతెల్ 14 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 26 పరుగులు చేయగా.. నాలుగో స్థానంలో ఆడిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ 21 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 304 పరుగులు సాధించింది.
అంతర్జాతీయ టీ20లలో ఫుల్ మెంబర్ జట్టు (ఐసీసీ టెస్టు హోదా కలిగిన జట్టు)పై ఇదే అత్యధిక స్కోరు. ఇంతకు ముందు జింబాబ్వే గాంబియా మీద 344 పరుగులు చేసింది. కానీ గాంబియా అసోయేట్ జట్టు మాత్రమే. ఇక్కడ ఇంగ్లండ్.. సౌతాఫ్రికా వంటి ఫుల్ మెంబర్ టీమ్‌పై ఈ ఘనత సాధించడం విశేషం.
జింబాబ్వే తర్వాత..
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 48 బౌండరీలు నమోదయ్యాయి. ఇందులో ముప్పై ఫోర్లు, పద్దెనిమిది సిక్సర్లు ఉన్నాయి. తద్వారా అంతర్జాతీయ టీ20లలో అత్యధిక బౌండరీలు బాదిన రెండో జట్టుగా ఇంగ్లండ్ చరిత్ర పుటల్లో చోటు సంపాదించింది. అంతకుముందు.. 2024లో జింబాబ్వే.. గాంబియా (అసోసియేట్ టీమ్) జట్టు మీద 57 బౌండరీలు నమోదు చేసింది.
ప్రపంచంలోనే తొలి జట్టుగా
అయితే, పొట్టి ఫార్మాట్‌లో ఓ ఫుల్ మెంబర్ జట్టు (ఐసీసీ టెస్టు హోదా కలిగిన జట్టు) పై అత్యధిక బౌండరీలు బాదిన ఘనత మాత్రం ఇంగ్లండ్‌కే దక్కుతుంది. ప్రపంచంలో ఇంత వరకు ఏ జట్టు కూడా ఈ ఫీట్ నమోదు చేయలేదు.