
సౌతాఫ్రికాతో రెండో టీ20లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏకంగా 146 పరుగుల తేడాతో చిత్తు చేసి.. తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
కాగా మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు ఇంగ్లండ్ (ENG vs SA)కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలి రెండు వన్డేలు గెలిచిన సఫారీలు 2-1తో సిరీస్ సొంతం చేసుకున్నారు. ఇక టీ20లలోనూ ప్రొటిస్ జట్టు శుభారంభమే అందుకుంది.
కార్డిఫ్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో డీఎల్‌ఎస్ పద్ధతిలో 14 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం రాత్రి రెండో టీ20 జరిగింది. మాంచెస్టర్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు దిగింది.
సాల్ట్ విధ్వంసకర, భారీ శతకం
ఓపెనర్ ఫిల్ సాల్ట్ (Phil Salt) ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ప్రొటిస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ముప్పై తొమ్మిది బంతుల్లోనే శతకమార్కు అందుకున్నాడు. మొత్తంగా 60 బంతుల్లో 15 ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 141 పరుగులతో.. 235కు పైగా స్ట్రైక్‌రేటుతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.
బట్లర్ మెరుపు ఇన్నింగ్స్
ఇక మరో ఓపెననర్ జోస్ బట్లర్ (Jos Buttler) సైతం మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 30 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 8 ఫోర్లు, 7 సిక్స్‌లు బాది.. 276కు పైగా స్ట్రైక్‌రేటుతో 83 పరుగులు రాబట్టాడు. మిగతా వారిలో జేకబ్ బెతెల్ (14 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ ధనాధన్ (21 బంతుల్లో 41 నాటౌట్) దంచికొట్టాడు.
ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 304 పరుగులు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో బిజోర్న్ ఫార్చూన్‌కు రెండు వికెట్లు దక్కాయి.
ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా శుభారంభమే అందుకున్నా దానిని కొనసాగించడంలో విఫలమైంది. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (20 బంతుల్లో 41), మరో ఓపెర్ రియాన్ రికెల్టన్ (10 బంతుల్లో 20) వేగంగా ఆడే ప్రయత్నం చేశారు.
ఇంగ్లండ్ బౌలర్ల విజృంభణ
వన్‌డౌన్‌లో వచ్చిన లువాన్ డ్రి ప్రిటోరియస్ (2)తో పాటు.. డెవాల్డ్ బ్రెవిస్ (4) కూడా విఫలం కాగా.. ట్రిస్టన్ స్టబ్స్ (23), డొనోవాన్ ఫెరీరా (23), బిజోర్స్ ఫార్చూన్ (32) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి నిలవలేక స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.
ఈ క్రమంలో 16.1 ఓవర్లలో 158 పరుగులు మాత్రమే చేసిన సఫారీ జట్టు.. ఇంగ్లండ్ చేతిలో 146 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది.ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు, సామ్ కర్రన్, లియామ్ డాసన్, విల్ జాక్స్ రెండేసి వికెట్లు కూల్చి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. ఆదిల్ రషీద్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇక విధ్వంసకర శతక వీరుడు, ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
టీమిండియా రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్
కాగా అంతర్జాతీయ టీ20లలో ఫుల్ మెంబర్ జట్లలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. సౌతాఫ్రికాపై రెండు వికెట్ల నష్టానికి 304 పరుగులు స్కోరు చేసి ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలో టీమిండియా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. కాగా 2024లో హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌పై టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 297 పరుగులు సాధించింది.
చదవండి: బుమ్రా బౌలింగ్‌లో మా వాడు 6 సిక్స్‌లు కొడతాడు: పాక్ ప్లేయర్ ఓవరాక్షన్
PHIL SALT - THE FASTEST CENTURION FOR ENGLAND IN T20I HISTORY. 🥶pic.twitter.com/JzhM7RrLme
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2025