
ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు సమయం అసన్నమవుతోంది. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. భారత్ ఇప్పటికే తమ తొలి మ్యాచ్‌లో యూఏఈను చిత్తు చేయగా.. పాక్ జట్టు వారి మొదటి మ్యాచ్‌లో శుక్రవారం ఒమన్‌తో తలపడనుంది.
పాకిస్తాన్ కూడా వారి తొలి మ్యాచ్‌లో సునాయసంగా విజయం సాధించే అవకాశముంది. కానీ అసలు సిసలైన సవాల్ ఆదివారం ఎదురుకానుంది. ఆసియాకప్‌లో పాక్‌పై టీమిండియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. మరోసారి దాయాదిపై తమ జోరును కొనసాగించాలని సూర్యకుమార్ సేన ఉవ్విళ్లూరుతోంది.
ప్రత్యర్ధి పాక్ సైతం ఎలాగైనా టీమిండియాను ఓడించాలని పట్టుదలతో ఉంది. ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ తన్వీర్ అహ్మద్ సంచలన కామెంట్స్ చేశాడు. టీమిండియా సూపర్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో పాక్ యవ ఓపెనర్ సైమ్ అయూబ్ వరుసగా ఆరు సిక్స్‌లు కొడతాడని తన్వీర్ బిల్డప్ ఇచ్చాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన్వీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దీంతో భారత అభిమానులు తన్వీర్‌కు కౌంటరిస్తున్నారు. బుమ్రా బౌలింగ్‌లో అయూబ్ కనీసం ఫోర్ అయినా కొడతాడా? అని ఫ్యాన్స్ సెటైర్‌లు వేస్తున్నారు. కాగా ప్రపంచ క్రికెట్‌లో బుమ్రా నెంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
స్మిత్, రూట్, స్టోక్స్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు సైతం బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డారు. అటువంటిది ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు అంటే అది కలలో కూడా జరగదు. అయితే పాక్ జట్టులో అయూబ్ గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. 41 టీ20ల్లో 816 పరుగులు చేశాడు. ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా అయూబ్ చేయగలడు.
చదవండి: మా జట్టుకు మాత్రం.. గిల్ ఇలా ఆడడు: గుజరాత్ టైటాన్స్ కోచ్