
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీతో అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు టీమిండియా స్టార్ శుబ్‌మన్ గిల్ (Shubman Gil). దాదాపు ఏడాది విరామం తర్వాత యూఏఈతో మ్యాచ్ సందర్భంగా బుధవారం రీఎంట్రీ ఇచ్చాడు. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన గిల్ ధనాధన్ దంచికొట్టాడు.
గిల్ ధనాధన్
యూఏఈ విధించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గిల్ విశ్వరూపం ప్రదర్శించాడు. పసికూనపై ఆది నుంచే ఎదురుదాడి ఆరంభించాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతి (రెండో ఓవర్ మొదటి బంతి)నే ఫోర్‌గా మలిచిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అదే ఓవర్లో ఓ సిక్సర్ కూడా బాదాడు.
టీమిండియా ఘన విజయం
ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా తొమ్మిది బంతులు ఆడిన శుబ్‌మన్ గిల్.. రెండు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి స్ట్రైక్‌రేటు 222.22. ఇదిలా ఉంటే.. గిల్‌తో పాటు అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్) రాణించడంతో 4.3 ఓవర్లలోనే పని పూర్తి చేసింది టీమిండియా. యూఏఈని తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి ఘన విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ బ్యాటింగ్ కోచ్ పార్థివ్ పటేల్.. తమ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టైటాన్స్‌కు ఆడేటపుడు గిల్‌లో ఇలాంటి దూకుడు చూడలేదని అన్నాడు. ‘‘తొలి బంతి నుంచే గిల్ అటాకింగ్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు.
మా జట్టుకు మాత్రం.. గిల్ ఇలా ఆడడు
ఆ తర్వాత వెంటనే.. క్రీజు బయటకు వచ్చి మరీ ఫోర్ బాదాడు. అదే ఓవర్లో సిక్స్ కూడా కొట్టాడు. గుజరాత్ టైటాన్స్‌కు ఆడేటపుడు అతడిలో ఇలాంటి దూకుడు ఎప్పుడూ చూడలేదు. నిజానికి ఇక్కడ కుదురుకునేందుకు గిల్ కాస్త సమయం తీసుకుంటాడు.
కానీ టీమిండియా తరఫున ఈ మ్యాచ్‌లో ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్న కారణంగా ఆది నుంచే దూకుడు ప్రదర్శించాడు. అద్భుతంగా ఆడాడు కూడా!’’ అని పార్థివ్ పటేల్ గిల్‌ను ప్రశంసించాడు.
టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా
కాగా టైటాన్స్‌కు సారథ్యం వహించడంతో పాటు ఓపెనర్‌గానూ గిల్ సేవలు అందిస్తున్నాడు. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియా టెస్టు కెప్టెన్‌గా గిల్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా బ్యాట్‌తో ఇరగదీసిన ఈ పంజాబీ బ్యాటర్.. కెప్టెన్‌గానూ 2-2తో సిరీస్ సమం చేయగలిగాడు.
ఇక భవిష్యత్తులో టీమిండియా మూడు ఫార్మాట్లలో గిల్‌ను కెప్టెన్‌ను చేయాలనే ఉద్దేశంతో.. ఇటీవలే టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ తిరిగి నియమించింది. ప్రస్తుతం టీమిండియాకు వన్డేల్లో రోహిత్ శర్మ, టీ20లలో సూర్యకుమార్ యాదవ్, టెస్టుల్లో శుబ్‌మన్ గిల్ కెప్టెన్లుగా పనిచేస్తున్నారు.
చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే..